‘షిర్డీ ఆలయ మూసివేత వార్తలు అవాస్తవం’

18 Jan, 2020 09:22 IST|Sakshi

ఔరంగాబాద్‌: షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేన–ఎన్సీపీ– కాంగ్రెస్‌ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని ఆరోపించింది. షిర్డీ సాయి జన్మ స్థలం విషయమై రాజకీయ జోక్యం ఇలాగే కొనసాగితే షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్‌ ఎంపీ సుజయ్‌ విఖే పాటిల్‌ హెచ్చరించారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు.

అయితే, ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్‌ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ పీఆర్‌వో మోహన్‌ యాదవ్‌ చెప్పారు. సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో సమావేశమవుతామని తెలిపారు.

మరిన్ని వార్తలు