మోదీ, జిన్‌పింగ్‌ తెగ ఊయల ఊగారు, ఏం లాభం?

29 May, 2020 10:26 IST|Sakshi
ఊయల ఊగుతున్న జిన్‌పింగ్‌, మోదీ(ఫైల్‌)

మోదీ, జిన్‌పింగ్‌ల మైత్రి, భారత్‌- చైనా సరిహద్దు గొడవపై ‘‘ సామ్నా’’ ఎడిటోరియల్‌

ముంబై : అధికార శివసేన పార్టీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది. చైనా విషయంలో మోదీ తీరును అధికార పార్టీ తప్పుబట్టింది. నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య స్నేహాంతో రెండు దేశాల మధ్య మైత్రి పెరిగి భారత్‌, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం సద్దు మణుగుతుందని భావించినప్పటికి అలా జరగటం లేదని మండిపడింది. ఈ మేరకు పార్టీ మానస పుత్రిక సామ్నా దినపత్రికలో ఎడిటోరియల్‌ ప్రచురించింది. భారత్‌, చైనాల మధ్య పరిస్థితులను చక్కబెట్టడానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారంపై కూడా చర్చించింది. ‘‘ చైనా ముందడుగు.. ట్రంప్‌ సరదా!’’  పేరిట రాసిన ఈ ఎడిటోరియల్‌లో.. ‘‘ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా బలగాలు భారత సరిహద్దులో దాడి మొదలుపెట్టాయి. సంక్షోభాలను అవకాశంగా తీసుకుని చైనా ప్రతిసారి దాడికి పాల్పడుతుంది. ( మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్ )

ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ గుజరాత్‌ వచ్చినపుడు చాలా చక్కగా చూసుకున్నారు. గుజరాతీ రుచులు దోక్లా, షెవ్‌ గాతియాలతో విందు ఏర్పాటు చేశారు. మోదీ, జిన్‌పింగ్‌లు తెగ ఊయల ఊగటం అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కానీ ఏం లాభం లేకుండా పోయింది. లడఖ్‌‌లోని తమ భూభాగంలోకి భారత బలగాలు చొరబడ్డాయని చైనా.. తమ భాగంలోనే పాట్రోలింగ్‌ చేస్తున్నామని భారత బలగాలు చెబుతున్నాయి. ఇక్కడో పెద్ద జోక్‌ ఏంటంటే ఈ గొడవను తీర్చడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహిస్తాననటం’’ అని పేర్కొంది. ( ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన )

>
మరిన్ని వార్తలు