పొత్తు ఫైనల్‌ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ

18 Feb, 2019 18:44 IST|Sakshi

సాక్షి, ముంబై : మూడేండ్ల పాటు కలహాల కాపురం సాగించిన బీజేపీ-శివసేన మరోసారి భాయ్-భాయ్ అన్నాయి. మహారాష్ట్రలో చెరిసగం సీట్లకు పోటీచేసేందుకు అంగీకరించాయి. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్‌షా చేపట్టిన మంత్రాంగం ఫలించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇరు పార్టీల పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాని మోదీని, బీజేపీని దుమ్మెత్తిపోయడం శివసేనకు రివాజుగా మారింది. మిత్రపక్షమే ఇలాంటి విమర్శలు చేయడమా? అని అందరూ నోళ్లు నొక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కాగా,  ఓ దశలో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందేమో.. కమలానికి పక్కలో బల్లెంగా మారుతుందేమో అని అనుమానాలు కలిగాయి. కానీ మేమంతా నిజానికి ఒకటేనని, ఒకేగూటి పక్షులమని రెండు పార్టీలు తమ పొత్తు ఖరారు చేసుకున్నాయి.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. అలాగే బీజేపీ 25 స్ధానాల్లో బరిలో నిలవనుండగా, సేన 23 స్థానాల్లో పోటీ చేయనుంది.

దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

మారిన సమీకరణలు..
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో చెరి సగం సీట్లు పంచుకుని రెండు పార్టీలు పొత్తును ఖరారు చేసుకున్నాయి. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ– శివసేనల మధ్య పొత్తు సోమవారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.  రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా అందులో శివసేన 23 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 50:50 ఫార్ములాకు ఇరు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర దింపినట్లు అయింది. పొత్తుపై స్పష్టత రావడంతో బీజేపీ, శివసేన నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు.  

శివసేన ఖాతాలోకి పాల్ఘర్‌!
గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, పాల్ఘర్‌ లోక్‌సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ చింతామణ్‌ వంగా మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ గత సంవత్సరం మేలో ఉప ఎన్నిక జరిగింది. చింతామణ్‌ వంగా చనిపోయిన తరువాత బీజేపీ నాయకులు తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌ వంగా శివసేనలో చేరారు. సానుభూతి ఓట్లతో కచ్చితంగా శ్రీనివాస్‌ గెలుస్తాడని భావించిన శివసేన బీజేపీని ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలని సూచించింది. కానీ, ఆ స్థానం బీజేపీదేనని తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ పట్టుబట్టింది. చివరకు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్‌ ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిత్‌ గెలిచారు. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ నాయకులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో శివసేన ఈ స్థానంలో మళ్లీ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతుందా లేక మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

కాగా, పాల్ఘర్‌ లోక్‌సభ నియోజక వర్గం శివసేన వాటాలోకి వెళ్లడంతో రాజేంద్ర గావిత్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో గావిత్‌ తప్పుకుంటారా లేక తిరుగుబాటు చేసి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మొదటి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని ఉద్ధవ్‌పై ఒత్తిడి చేశారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు కలిసే పోటీ చేస్తామని అనేక సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చారు. అమిత్‌ షా- ఉద్ధవ్‌ థాకరే భేటీతో పొత్తులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.


ప్రస్తుతం రూపొందించిన ఫార్మూల ప్రకారం లోకసభ ఎన్నికల్లో బీజేపీ–25, శివసేన–23, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–144, శివసేన–144 స్థానాల చొప్పున పోటీ చేస్తారు. ఇంతకుముందు శివసేనతో పొత్తు కుదరకపోవడానికి బీజేపీ మిత్రపక్షాలే ప్రధాన కారణమని తెలిసింది. సీట్లు సర్దుబాటు చేసే సమయంలో మిత్రపక్షాలు రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ, ఆర్పీఐ (రాందాస్‌ ఆఠావలే వర్గం), శివ్‌ సంగ్రామ్‌ పార్టీలకు కనీసం 20 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ, ఈ మిత్రపక్షాలు బీజేపీకి చెందినవి కావడంతో వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదని శివసేన స్పష్టం చేసింది. బీజేపీ తమ వాటాలోకి వచ్చిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని శివసేన పేర్కొంది. చివరకు శివసేన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గినట్లు సమాచారం. తాజాగా ఇరు పార్టీలు సగం సీట్లు సర్ధుబాటు చేసుకోవడంతో   మిత్ర పక్షాలకు ఎవరి వాటాలో వారే కేటాయించుకోవల్సి ఉంటుందని తెలిసింది.

>
మరిన్ని వార్తలు