పాప్‌ సింగర్‌కు చేదు అనుభవం..

30 Jul, 2019 15:32 IST|Sakshi

వాంకోవర్‌: పంజాబ్‌ పాప్‌ సింగర్‌ గురు రాంధవాకు చేదు అనుభవం ఎదురైంది. కెనడాలోని వాంకోవర్‌లో ఆదివారం రాత్రి కచేరీ ఇచ్చి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేశాడు. కెనడాలోనే అతిపెద్ద థియేటర్‌ అయిన క్వీన్‌ ఎలిజబెత్‌ థియేటర్‌లో గురు రాంధవా సంగీత ప్రదర్శన ఇచ్చాడు. అనంతరం ఎగ్జిట్‌ గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఎవరో దుండగుడు అతని మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పంజాబ్‌కు చెందిన గురు రాంధవా గతంలో చిన్నపాటి కచేరీలు ఇస్తుండేవాడు. ఒకవైపు ఎంబీఏ చదువుతూనే మరోవైపు చిన్న చిన్న షోలు చేస్తుండేవాడు. తన ర్యాప్‌ పాటలు జనాల్లో క్లిక్‌ అవటంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ‘హై రేటెడ్‌ గబ్రూ, లాహోర్‌, సూట్‌’ వంటి పాటలతో తక్కువకాలంలోనే  మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంధవా తన మకాన్ని ఢిల్లీకి మార్చాడు. ఆ తర్వాత మ్యూజిక్‌ కంపోజర్‌గా, పాటల రచయితగా, గాయకుడిగా పలు అవతారాలు ఎత్తాడు. ఇతని పాటలు యూట్యూబ్‌లో  మిలియన్ల వ్యూస్‌ను సంపాదిస్తూ సంచలనాలు సృష్టి‍స్తున్నాయి. తాజాగా అతను విడుదల చేసిన ‘స్లోలీ స్లోలీ’ పాట ఒక్కరోజులోనే 33 మిలియన్ల వ్యూస్‌ను తెచ్చిపెట్టింది. కాగా ఈ పాటకు అమెరికన్‌ కంపెనీ గిఫ్టీ విజువల్స్‌ను అందించింది.

మరిన్ని వార్తలు