రైలు బోగినే.. ప్రసూతి గదైన వేళ

17 Apr, 2018 19:29 IST|Sakshi

సీతాపూర్‌: రైలు బోగే ఆ తల్లికి ప్రసూతి గది అయింది. స్ధానిక రైల్వే పోలీసు ఆమె పాలిట దేవుడయ్యాడు. అధికారులు, తోటి ప్రయాణికుల సాయంతో ఆ మహిళ రైలు బోగిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జననాయక్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం సుమన్‌ దేవీ (30), తన భర్త హరి ఓంతో కలిసి ప్రసవం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కి బయలుదేరింది. మార్గమధ్యలో సుమన్‌ దేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. రైలు సీతాపూర్‌ చేరుకునే సరికి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆమె భర్త హరిఓం సీతాపూర్‌ స్టేషన్‌ ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి (జీఆర్‌పీ) సురేష్‌ యాదవ్‌ని సహాయం చేయవలసిందిగా కోరాడు.

అదృష్టవశాత్తు ఆ అధికారి కూడా డా​క్టర్‌ కావడంతో ఆయన వెంటనే స్పందించి తన తోటి మహిళా కానిస్టేబుల్‌, ఇతర మహిళా ప్రయాణికుల సాయంతో సుమన్‌ దేవికి రైలు బోగిలోనే ప్రసవం చేశారు. సుమన్‌ దేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అధికారులు అంబులెన్స్‌ని ఏర్పాటు చేయడంతో తల్లి, బిడ్డలను సీతాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో  రైలు ఒ‍క గంట ఆలస్యమైంది.

రైలులోనే ప్రసవం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మా షైక్‌ (26) అనే మహిళ ముంబై లోకల్‌ రైలులోనే ప్రసవించింది. సల్మా ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే సమీప దాదర్‌ స్టేషన్‌లోని ఒక్క రూపాయి ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించారు. సల్మాకు క్రోనింగ్‌ మొదలవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వ్యవధి లేకపోయింది. వెంటనే రైలులోని ఆడవారి కంపార్ట్‌మెంట్‌లో ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డలను సమీప కేయీఎమ్‌ ఆస్పత్రికి తరలించారు.


ముంబై లోకల్‌ రైలులో సల్మా షైక్‌ బిడ్డతో రైల్వే అధికారులు, వైద్య సిబ్బంది (పాత ఫొటో)

మరిన్ని వార్తలు