ఈ కాలంలో.. చర్మం అందంగా ఉండాలంటే..

16 Jul, 2015 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ: వర్షాకాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో చర్మ వ్యాధులు ప్రధానమైనవి. వాతావరణ మార్పులు, కలుషిత నీరు తదితర కారణాల వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతాయి. దురద, మంటలు, బొబ్బర్లు వంటివి ఎక్కువ మందిని వేధిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వర్షాకాలంలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు నవీన్ తనేజా సూచిస్తున్నారు.
 
తేనె

చర్మ వ్యాధుల నివారణలో, చర్మం అందంగా తయారవడంలో తేనె మంచి హితకారిణిగా పనిచేస్తుంది. తేనెను పలు ఆహార పదార్థాలతో కలిసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తేనె మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి మాస్క్‌లా చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. సున్నిత చర్మం కలవారికి కూడా ఇది చర్మం మృదువుగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది.

 
తేయాకు నూనె
తేయాకు, కొబ్బరి నూనెలను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు కూడా ఇది ఉపకరిస్తుంది. అనేక సూపర్ మార్కెట్లలో తేయాకు నూనె లభిస్తుంది.
 
పండ్లు
మామిడి, దానిమ్మ వంటి పండ్లు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. మచ్చల్ని తొలగించడంతోపాటు చర్మానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి. కర్బూజా పండు కూడా ఇలాగే పనిచేస్తుంది. ఈ పండ్ల రసాల్ని మిల్క్ పౌడర్‌తో కలిసి చర్మానికి రాస్తే ఉపయోగం ఉంటుంది.
 
కలబంద జెల్
పెరట్లోనూ పెరగగల కలబందతో అనేక ప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే. వర్షాకాలంలో సంభవించే చర్మ వ్యాధుల నివారణలో సైతం ఇది బాగా పనిచేస్తుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సౌందర్య ఉత్పత్తిగా వాడే కలబంద జెల్‌ని చర్మానికి రాసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.
 
క్యాలమైన్ లోషన్
ఇది సూర్యకాంతి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి లోషన్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కీటకాలు కరవకుండా ఈ లోషన్లు రక్షిస్తాయి. తేయాకు, కొబ్బరి నూనెలను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు కూడా ఇది ఉపకరిస్తుంది. అనేక సూపర్ మార్కెట్లలో తేయాకు నూనె లభిస్తుంది.
 
యాంటీ ఫంగల్ పౌడర్
మార్కెట్లలో లభించే యాంటీ ఫంగల్ పౌడర్లను కూడా వాడాలి. దీని వల్ల చర్మంపై హానికర బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంటువ్యాధులు రాకుండా ఈ పౌడర్ నియంత్రిస్తుంది.
 
మాయిశ్చరైజర్
ఏ కాలంలోనైనా చర్మ సంరక్షణకు తోడ్పడేది మాయిశ్చరైజర్. అయితే దీన్ని మితంగానే వాడాలి. అతిగా వాడితే తిరిగి చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. చర్మానికి సరైన ఆక్సిజన్ అందకుండా పోయేవీలుంది. అందువల్ల చర్మంపై కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు.

మరిన్ని వార్తలు