'బీజేపీ నిరసన.. తీవ్రవాదుల హింస కంటే దారుణం'

29 Dec, 2015 17:53 IST|Sakshi

గువహాటి: అసోంలో సోమవారం బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చరిత్రలో అసాధారణమైనది, ఉల్ఫా తీవ్రవాదుల హింసాత్మక చర్యల కంటే భయకరంగా ఉందని బీజేపీ కార్యకర్తల తీరును మంగళవారం గొగోయ్ విమర్శించారు.

నిన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అసోం పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నలోమని ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మహిళా మంత్రిపై అసభ్యపదజాలం వాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా, నిరసన తెలిపిన 50 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని బీజేపీ నేతలు గొగోయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే బీజేపీ కార్యకర్తలు ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారని, గువహాటిలోని కాంగ్రెస్ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారని గొగోయ్ చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని అసోం పీసీసీ పేర్కొంది.

మరిన్ని వార్తలు