కాంగ్రెస్ నన్ను లక్ష్యంగా చేసుకుంది

25 Feb, 2016 02:38 IST|Sakshi
కాంగ్రెస్ నన్ను లక్ష్యంగా చేసుకుంది

జేఎన్‌యూ, రోహిత్ ఆత్మహత్యపై చర్చకు స్మృతి ఇరానీ భావోద్వేగ స్పందన

న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం, హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాల తీవ్ర విమర్శలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో స్పందించారు. రోజంతా జరిగిన చర్చకు ఆమె భావోద్వేగపూరిత సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని ఎదురు దాడికి దిగారు. కన్హయ్యకుమార్, మరికొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు జేఎన్‌యూ అధికారులే స్వయంగా గుర్తించారని పేర్కొన్నారు. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల మరణంలో తన మంత్రిత్వశాఖ పాత్ర ఏమీ లేదని.. మృతుడు స్వయంగా ఆత్మహత్య లేఖలో తన చర్యకు ఎవరినీ బాధ్యులను చేయరాదని పేర్కొన్నాడని ఉటంకించారు. స్మృతి సమాధానం చెప్పటం ఆరంభించగానే కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశాయి. స్మృతి సమాధానంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

 నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా...
 ‘‘అమేధీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్‌పై పోటీ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ నన్ను లక్ష్యంగా చేసుకుంటోంది. నా విధిని నేను నిర్వర్తించినందుకు గాను నేను క్షమాపణ కోరను. నేను విద్యను కాషాయీకరణ చేస్తున్నానన్న ఆరోపణ నిరాధారం. అటువంటి ప్రయత్నం నేను ఏదైనా చేసినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.

 ఆ నినాదాలు రాజ్యంపై తిరుగుబాటే...
 జేఎన్‌యూ భద్రతా సిబ్బంది నివేదిక.. విద్యార్థులు ఒక కవితా కార్యక్రమం నిర్వహించటానికి అనుమతి పొందినప్పటికీ, కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాల్లో పాలుపంచుకోవటాన్ని వారు గుర్తించినట్లు చెప్తోంది. ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న వాళ్లలో ఉమర్‌ఖలీద్, కన్హయ్యకుమార్, ఇతరులను జేఎన్‌యూ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా.. విచారణ పూర్తయ్యేవరకూ వారు క్యాంపస్‌లో ఉండేందుకు అనుమతించారు.  (ఫిబ్రవరి 9వ తేదీ నాటి కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ ప్రయివేటు భద్రతా సిబ్బంది సమర్పించిన నివేదిక, వర్సిటీ అధికారుల పత్రాల ఆధారంగా జేఎన్‌యూలో జరిగిన ఘటనల క్రమాన్ని వివరించారు.) ఒక కవితా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉమర్‌ఖలీద్ అనుమతి కోరారు. అందుకు అనుమతి నిరాకరించినప్పటికీ.. విద్యార్థులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది భారత వ్యతిరేక నినాదాలు చేసే వేదికగా మారింది. ‘భారత్ తేరీ బర్బాదీ తక్ జంగ్ రహేగీ, జంగ్ రహేగీ (భారతరాజ్య వినాశనం వరకూ పోరాటం కొనసాగుతుంది) వంటి నినాదాలు చేశారు.

 కమ్యూనిస్టులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు...
 సామ్యవాదులు (కమ్యూనిస్టులు) విద్యార్థులను రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధాలుగా వినియోగించుకుంటున్నారు. మహిషాసుర అమరత్వ దినోత్సవం పేరుతో జరిపిన ఒక కార్యక్రమంలో దుర్గా దేవతను కించపరిచే విధంగా చిత్రీకరించారు. దీనిపై వేసిన పాంప్లెట్లు చూడండి. దీనిపై చర్చ జరపటానికి తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సిద్ధమా? మీరు ఈ పాంప్లెట్లను పశ్చిమబెంగాల్‌లో చూపిస్తారా? గత ప్రభుత్వ తప్పుడు విధానాలే దీనికి కారణం. విద్యారంగాన్ని యుద్ధక్షేత్రంగా మార్చవద్దు.. దాని ఫలితాలు దారుణంగా ఉండొచ్చు. కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్ హెచ్‌ఆర్‌డీ మంత్రిగా ఉన్నపుడు విద్యా విధానం వక్రీకరణకు గురైంది. ఇందుకు సంబంధించి తీస్తా సెతల్వాద్ రాసిన పత్రం చూడండి. ‘ఒక దేశం అవివేకులను ఎదుర్కోగలదు.. కానీ అంతర్గత రాజ్యద్రోహం చాలా ప్రమాదకరం’ అని ఒక రోమన్ తత్వవేత్త అన్నారు. నేను చాణక్య మాటలను ఉదహరించినట్లయితే ప్రతిపక్షం నాపై కాషాయీకరణ ఆరోపణ చేసి ఉండేది.

 కేసీఆర్.. ప్రధానితో మాట్లాడారు: జితేందర్‌రెడ్డి
 తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెంటనే ఇంటెలిజెన్స్ ఐజీకి ఫోన్ చేసి, ఆ కేసుపై సత్వర చర్య తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ప్రధానమంత్రితో కూడా సీఎం మాట్లాడారని చెప్పారు. ఒక బృందాన్ని శాంతింపజేసేందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

 సత్యమేవ జయతే: ప్రధాని ట్వీట్
 స్మృతి భావోద్వేగ ప్రకటన అనంతరం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో ‘సత్యమేవ జయతే’ అని వ్యాఖ్యానిస్తూ.. ‘స్మృతి ఇరానీ ప్రసంగం వినండి’ అంటూ ఆమె ప్రసంగం వీడియోను పోస్ట్ చేశారు.

 జన్మనిచ్చే తల్లి ప్రాణాలు తీయదు...
 (రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి విమర్శలకు స్మృతి గద్గద స్వరంతో స్పందిస్తూ) జన్మనిచ్చే ఒక తల్లి ప్రాణాలు తీయదు. వేములకు ఆర్థిక సాయాన్ని నిరాకరించారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అతడిని బహిష్కరించింది. అందులో సభ్యులు ఎవరినీ ఎన్‌డీఏ నియమించలేదు. వారందరూ కాంగ్రెస్ నియమించిన వారే. యూనివర్సిటీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత హనుమంతరావు పదే పదే నాకు లేఖలు రాశారు. నేను కేవలం నా బాధ్యతలను నిర్వర్తించాను.. అందుకు నేను క్షమాపణ కోరను. పప్పుయాదవ్, సౌగతారాయ్, అసదుద్దీన్‌ఒవైసీ, శశిథరూర్ సహా పలువురు ఎంపీలు వివిధ స్కూళ్లలో ప్రవేశాల వంటి విజ్ఞప్తులు చేస్తూ నాకు లేఖలు రాశారు. వేముల (ఆత్మహత్య) గురించి ఆ దుర్దినం ఉదయం నాకు తెలియగానే.. నేను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన బిజీగా ఉన్నారని నాకు చెప్పారు. ఆయన తిరిగి ఫోన్ చేస్తారని నేను ఇంకా ఎదురు చూస్తున్నా. వేములకు 12 గంటల పాటు ఎటువంటి వైద్య సహాయం అందించలేదని.. దానిని రాజకీయ అంశం చేసే ప్రయత్నం జరిగిందని తెలంగాణ పోలీసు నివేదిక చెప్తోంది. రాజకీయాలే ప్రాధాన్యమయ్యాయి.. వేములకు సమయానికి వైద్య సహాయం అందలేదు.’’

మరిన్ని వార్తలు