ప్రమాదకరంగా ప్రజాతీర్పు దుర్వినియోగం: సోనియా గాంధీ

12 Sep, 2019 20:16 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా ప్రమాదకరమైన రీతిలో దుర్వినియోగం చేస్తోందని, ప్రజాస్వామ్యానికి ఆ పార్టీతో ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సోనియా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దూకుడుగా ముందుకు వెళ్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

‘మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి హాని జరుగుతోంది. ప్రజా తీర్పును ప్రమాదకరమైన స్థాయిలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. దీనిపై తప్పనిసరిగా కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టాలి. మన పోరాట పటిమకు ఇది పరీక్షా సమయం’అని సోనియా వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నష్టం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది’అని పేర్కొన్నారు.

ఆర్థిక వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి మహనీయుల ప్రబోధాలను వక్రీకరించి తమ అజెండాకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి మందగించింది. పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. వాస్తవమేంటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మున్ముందు నిరుద్యోగం తీవ్రత మరింత పెరగనుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. 

గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2వ తేదీన దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు జ్యోతిరాదిత్య సిందియా, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర నేతలు గులామ్‌ నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే, పంజాబ్‌, రాజస్తాన్‌, పుదుచ్చేరి సీఎంలు అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌, నారాయణ స్వామి తదితర 40 మంది నేతలు పాల్గొన్నారు. 

చదవండి : సోనియాకు అరుణ్‌ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్‌ ఇదే

మరిన్ని వార్తలు