మీ మనసులో ఏముందో చెప్పండి

16 Nov, 2017 02:00 IST|Sakshi

రవిశంకర్‌ రంగప్రవేశంపై ముస్లిం సంస్థల అభ్యంతరం

లక్నో/న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు రవిశంకర్‌ జోక్యం చేసుకోవడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముందు ఆయన తన ఆలోచనేమిటనేది విధిగా వెల్లడించాలని డిమాండ్‌ చేశాయి. ఈ వివాదం విషయంలో షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ వాసిం రజ్వి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అవి అనవరసమంటూ మండిపడ్డాయి. ‘ఈ కేసులోని అన్నిపక్షాలతోనూ రవిశంకర్‌ సంప్రదింపులు జరుపుతారని చెబుతున్నారు. అయితే ఆయన ఇప్పటిదాకా తమను సంప్రదించలేదు’ అని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) చైర్మన్‌ మౌలానా వలి రెహమాని బుధవారం స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకసారి యత్నించారని, అయితే వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని సూచించారని గుర్తుచేశారు. ఈసారి ఆయన ఏ ఫార్ములాతో వస్తున్నారో చెప్పాలని, ఆ తర్వాత తమ ప్రతినిధి ఆయనతో సంప్రదింపులు జరుపుతారని అన్నారు.  

సీఎంతో రవిశంకర్‌ భేటీ
రవిశంకర్‌ బుధవారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రవిశంకర్‌.. సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారని, ఈ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు జరిగిందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఆదిత్యనాథ్‌తోపాటు రవిశంకర్‌..దిగంబర్‌ అఖాడాకు చెందిన సురేశ్‌ దాస్, జనమేజయ్‌ శరణ్‌ (రసిక్‌పీఠ్‌), రాజారాంచంద్ర ఆచార్య (నిర్మోహి అఖాడా)లతోపాటు అనేక హిందూ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇదొక ఆరంభం. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ఎవరూ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం లేదు. అందరితోనూ అయోధ్య వివాదంపై సంప్రదింపులు జరుపుతా’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు