ఇంకా లెక్కిస్తున్నాం

13 Jul, 2017 01:41 IST|Sakshi
ఇంకా లెక్కిస్తున్నాం

► రద్దయిన నోట్లపై  ఆర్బీఐ చీఫ్‌ ఉర్జిత్‌ పటేల్‌
► పార్లమెంటరీ కమిటీ ముందు రెండోసారి హాజరు


న్యూఢిల్లీ: రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వెల్లడించారు. రద్దు తర్వాత ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన ఆ నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని, అందువల్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఎంత డబ్బు వచ్చిందో కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. ‘ఆర్బీఐ ప్రత్యేక బృందం రోజుకు 24 గంటలూ ఆ నోట్లను లెక్కిస్తోంది. వారికి శనివారంతోపాటు చాలా సెలవులను తగ్గించాం. ఆదివారం మాత్రమే సెలవు లభిస్తోంది’ అని ఆయన బుధవారం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్బీఐకి ప్రస్తుతం 15,000 మంది సిబ్బంది ఉన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రద్దయిన నోట్లను లెక్కించడానికి కొత్త కౌంటింగ్‌ యంత్రాల కోసం టెండర్లు జారీచేసినట్లు ఉర్జిత్‌ పార్లమెంటరీ కమిటీకి చెప్పారు.

ఆయన ఈ కమిటీ ముందు హాజరు కావడం ఇది రెండోసారి. మూడు గంటలు కొనసాగిన ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌.ఎస్‌. ముంద్రా కూడా పాల్గొన్నారు. రద్దయిన నోట్లలో ఎంత మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని ఉర్జిత్‌ను నరేశ్‌ అగర్వాల్‌(సమాజ్‌వాదీ), సౌగతా రాయ్‌(తృణమూల్‌ కాంగ్రెస్‌) ప్రశ్నించారు. రద్దు కాకముందు దేశంలో మొత్తం రూ. 17.7 లక్షల కోట్ల డబ్బు చలా మణిలో ఉండేదని, ప్రస్తుతం రూ. 15.4 లక్షల కోట్లు ఉందని ఉర్జిత్‌ తెలిపారు. రద్దు తర్వాత తిరిగి చలామణిలోకి వచ్చిన డబ్బు పై ఆర్బీఐ చీఫ్‌ కచ్చితమైన సమాధానం చెప్పకపోవడంతో కమిటీలోని పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రశ్నలు అడగని మన్మోహన్‌
జనవరి నాటి కమిటీ సమావేశంలో ఉర్జిత్‌ను కఠిన ప్రశ్నలను అడిగిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తాజా సమావేశంలో ఆయనను ఎలాంటి ప్రశ్నలూ అడగలేదు. ఆర్బీఐ గవర్నర్‌ను కొందరు సభ్యులు ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా, కమిటీ చైర్మన్‌ వీరప్ప మొయిలీతోపాటు బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ అంశంపై ఉర్జిత్‌ను మళ్లీ కమిటీ ముందుకు పిలవబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు