విద్యావ్యవస్థను సంస్కరించండి

5 Jun, 2019 05:01 IST|Sakshi

పూర్తి మార్పులు చేయండంటూ కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం  

న్యూఢిల్లీ: వివిధ కోర్సుల అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు అధిక ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి లేకుండా చూడటం కోసం మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మహారాష్ట్రలో 2019–20 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు పడుతున్న దురవస్థ గురించి కోర్టు ప్రస్తావిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ‘మా విచారం అంతా విద్యార్థుల గురించే. ఇది ప్రతి ఏడాదీ జరుగుతుంది.

మెడికల్‌ లేదా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల మెదళ్లలో అనిశ్చితి నెలకొంటోంది’ అని జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాల వేసవికాల సెలవుల ధర్మాసనం పేర్కొంది. ‘విద్యా వ్యవస్థను మీరు పూర్తిగా ఎందుకు మార్చరు? విద్యార్థులకు ఈ మానసిక క్షోభ, ఒత్తిడి ఎందుకు? ఈ కేసులన్నీ ఎందుకు? విద్యార్థుల దుస్థితిని ఒకసారి పరిశీలించాల్సిందిగా కేంద్రం అలాగే అన్ని రాష్ట్రాలను మేం ఆదేశిస్తున్నాం. ఇలాంటి అనిశ్చితి కారణంగా విద్యార్థుల మొత్తం కెరీర్‌పైనే దుష్ప్రభావం పడుతుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

14లోపు తుది కౌన్సెలింగ్‌ నిర్వహించండి
మహారాష్ట్రలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 14లోపు తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేసన్‌పై తాము స్టే విధించిన తర్వాత కూడా ఇంకా కౌన్సెలింగ్‌ను ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

కౌన్సెలింగ్‌కు సంబంధించి స్థానిక వార్తా పత్రికల్లో ప్రభుత్వం వెంటనే ప్రకటనలు ఇవ్వాలనీ, 14వ తేదీలోపు కౌన్సెలింగ్‌ నిర్వహించి తీరాలని కోర్టు చెప్పింది. ఈ విడత కౌన్సెలింగే చివరిదని కూడా ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొనాలంది. అలాగే ఈ కేసులో తాము ఇప్పుడు ఇస్తున్న ఉత్తర్వులే అంతిమమనీ, ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పిటిషన్లనూ దేశంలోని ఏ కోర్టూ స్వీకరించకూడదని జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాలు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు