లెస్బియన్లు, గేలు ట్రాన్స్‌జెండర్లు కారు

1 Jul, 2016 02:59 IST|Sakshi
లెస్బియన్లు, గేలు ట్రాన్స్‌జెండర్లు కారు

సుప్రీం స్పష్టీకరణ
 
 న్యూఢిల్లీ: లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు సమాజంలో మూడోవర్గం (థర్డ్ జెండర్) కిందకు రారని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 2014 ఏప్రిల్ 15న ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా చెప్పిన ట్లు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాటి తీర్పు వచ్చిన అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలంటూ 2014 సెప్టెంబరులో కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కేంద్రం తరఫున హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 2014 నాటి తీర్పుననుసరించి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులను మూడోవర్గంగా పరిగణించాలా వద్దా అనే విషయంలో త మకు అయోమయం నెలకొందని అన్నారు.

ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ కార్యకర్తల తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తన వాదన వినిపిస్తూ గత రెండేళ్లుగా కేంద్రం 2014 నాటి కోర్టు తీర్పును అమలు చేయడం లేదని, ట్రాన్స్‌జెండర్ల విషయంలో తమకు కూడా స్పష్టత కావాలని అడిగారు. ఈ అభ్యర్థనలపై కోర్టు స్పందిస్తూ ‘హిజ్రాలను మూడోవర్గంగా గుర్తించాలని మేం 2014 నాటి తీర్పులోనే చెప్పాం. వారికి చట్టబద్ధ గుర్తింపు కల్పించి, విద్యలోనూ సామజికంగాను వెనుకబడిన వారిగా పరిగణించాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాం. వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పాం. వీరి జాబితాలోకి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు రారు’ అని గురువారం నాటి తీర్పులో వివరించింది.

మరిన్ని వార్తలు