జస్టిస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు

2 May, 2017 01:01 IST|Sakshi
జస్టిస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు

సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయన మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ కర్ణన్‌ను పరీక్షలకు తరలించేందుకు, వైద్యులకు సహకరించేందుకు పోలీసు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పశ్చిమ బెంగాల్‌ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 4న కోల్‌కతా ప్రభుత్వాసుపత్రిలో కర్ణన్‌ను పరీక్షించి.. 8లోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. జస్టిస్‌ కర్ణన్‌ సోమవారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ విషయంలో కర్ణన్‌ ఏమైనా చెప్పాలనుకుంటే అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే ఆయన చెప్పేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్‌ కర్ణన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్‌ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్‌ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.  

వైద్య పరీక్షలకు వెళ్లేది లేదు: కర్ణన్‌
వైద్య పరీక్షలు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుపై జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.  వైద్య పరీక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనన్నారు.  దళితుడిని కాబట్టే తనను అవమానిస్తున్నారని అన్నారు.

తనను ప్రశ్నిస్తున్న జడ్జీలంతా అవినీతిపరులేనని కర్ణన్‌ దుయ్యబట్టారు. ‘ఆ ఏడుగురు న్యాయమూర్తులను ఎయిమ్స్‌ ఆసుపత్రిలో మానసిక వైద్యుల బృందంతో తగు పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్లాలి’అని ఢిల్లీ డీజీపీని ఆదేశిçస్తూ సంతకం చేసిన ఆదేశాన్ని జస్టిస్‌ కర్ణన్‌ మీడియాకు సమర్పించారు.

మరిన్ని వార్తలు