రాజీవ్గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు స్టే

9 Jul, 2014 17:34 IST|Sakshi
రాజీవ్ గాంధీ

ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. శిక్ష తగ్గింపు అధికారాలపై తమిళనాడు ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో 1991 మే 21న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేశారు. రాజీవ్‌ గాంధీ హంతకులలో ముగ్గురు మురుగన్, పెరారివాలన్, శాంతన్ల మరణ శిక్షను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో యావజ్జీవ శిక్షకు కుదించింది. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజునే  ఆ ముగ్గురితోపాటు ఇదే కేసులో  యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, రాబర్ట్‌ పయస్‌, జయకుమార్‌, రవిచంద్రన్‌ మొత్తం ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు  ముఖ్యమంత్రి జయలలిత అధ్వర్యంలో మంత్రి మండలి  నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ హత్య అనేది దేశంపై జరిగిన దాడిగా అప్పుడు కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం పేర్కొంది.  ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వారిని విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా  ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతక వైఖరి అవలంభించకూడదని తెలిపారు.

జయలలిత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అత్యున్నత న్యాయస్థానం హంతకుల విడుదలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారు జైల్లో ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు ఇచ్చింది.

 రాజీవ్ గాంధీ హత్య కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించవలసిన పలు అంశాలు ఉండటంతో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచి ఓ జాబితా తయారుచేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా?, రాష్ట్ర ప్రభుత్వమా? లేక రెండూ కలిసి నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని నిర్ధారించాలని అప్పట్లో బెంచి కోరింది. అప్పటి నుంచి రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే పొడిగిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో శిక్ష తగ్గింపు అధికారాలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు