‘సర్జికల్‌’ యోధులకు శౌర్యపతకాలు

26 Jan, 2017 02:59 IST|Sakshi
‘సర్జికల్‌’ యోధులకు శౌర్యపతకాలు

న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్‌ దాడి చేసిన జవాన్లకు  కేంద్రం రిపబ్లిక్‌ డే సందర్భంగా శౌర్యపతకాలు ప్రకటించింది. దాడిలో పాల్గొన్న 4వ, 9వ పారామిటలరీలకు చెందిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్‌ సేవా తదితర మెడళ్లు వరించాయి. దాడిలో పటాలాలకు సారథ్యం వహించిన మేజర్‌ రోహిత్‌ సూరి(4వ పారా)కి శాంతిసమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్యపతకమైన కీర్తిచక్రను, ఈ దళాల కమాండింగ్‌ అధికారులైన కపిల్‌ యాదవ్, హర్‌ప్రీత్‌ సంధులకు యుధ్‌సేవాను ప్రకటించారు.

ఈ పటాలాల్లోని ఐదుగురికి శౌర్యచక్రలు, 13 మం దికి సేనా మెడల్స్‌ దక్కాయి. కాగా, గూర్ఖా రైఫిల్స్‌ హవల్దార్‌ ప్రేమ్‌ బహదూర్‌ రేస్మి మగర్‌కు మరణానంతరం కీర్తి చక్రను, పాండురంగ్‌ మహదేవ్, నాయక్‌ విజయ్‌ కుమార్‌ తదితరులకు మరణానంతరం సేనా మెడల్స్‌ను ప్రకటించారు. వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, ఇతర రక్షణ పతకాలు అందించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆర్మీ తూర్పు కమాండ్‌ సారథి మేజర్‌ ప్రవీణ్‌ బక్షి, ఆర్మీ చీఫ్‌ పదవికి బిపిన్‌ రావత్‌తో పోటీపడిన దక్షిణ కమాండ్‌ సారథి మేజర్‌ పీఎం హరీజ్‌లకు పరమ్‌ విశిష్ట సేవాల మెడళ్లు దక్కాయి.

>
మరిన్ని వార్తలు