గుండెపోటుతో మరణించిన వీర సైనికుడు | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మరణించిన వీర సైనికుడు

Published Thu, Sep 28 2023 12:46 AM

- - Sakshi

భట్టిప్రోలు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్‌ పురమా గోపరాజు (26) సోమవారం రాజస్థాన్‌లోని పాకిస్తాన్‌ బోర్డర్‌ జస్పల్‌మీర్‌ వద్ద విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్ధివదేహాన్ని మంగళవారం సికింద్రాబాద్‌ మిలటరీ హాస్పిటల్‌కు తరలించారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరపున అక్కడి ఐఏఎస్‌, మిలటరీ అధికారులు గోపరాజు పార్ధివదేహానికి నివాళి అర్పించారు.

ఏపీ ప్రభుత్వం తరఫున భట్టిప్రోలు మేజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ డి.వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ శివరామకృష్ణ సికింద్రాబాద్‌ వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని గోపరాజు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకు వచ్చారు. భట్టిప్రోలు నుంచి పల్లెకోన గ్రామస్తులు గోపరాజు పార్ధివదేహం వెంట ర్యాలీగా స్వగ్రామానికి వెళ్లారు. అమర్‌ రహే గోపరాజు అంటూ నినాదాలు చేశారు.

గోపరాజు భౌతికకాయం వెంట మిలటరీ కెప్టెన్‌ రిషబ్‌ సూద్‌, జూనియర్‌ కమిషనర్‌ ఆఫీసర్లు (జేసీవోలు) కురేష్‌, సుభాష్‌చంద్ర, గురవ్‌, పల్లిబాబు, మరో 25 మంది వివిధ విభాగాలకు చెందిన జవాన్లు వచ్చారు. గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నట్లు గ్రామ సర్పంచ్‌ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్‌, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శేరు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు దున్నా తిరుపతిబాబు తెలిపారు.

Advertisement
Advertisement