ఢిల్లీలో ముగ్గురు చిన్నారుల ఆకలిచావు

26 Jul, 2018 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆకలిచావులు వెలుగుచూశాయి. సరైన ఆహారం అందక ఢిల్లీలో రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలుకోల్పోయిన ఘటన ఢిల్లీలో చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని మండావలి ప్రాంతానికి చెందిన ఓ తల్లి తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న తన ముగ్గురు కుమార్తెలను మంగళవారం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. తీవ్ర పోషకాహారలేమి, ఆకలి కారణంగా చిన్నారులు ముగ్గురూ ఆస్పత్రిలో కన్నుమూశారని పోస్ట్‌మార్టమ్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

ఆకలి చావుల ఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ డెప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చిన్నారులున్న ఇంటిని సోదా చేశారు. నీళ్ల విరేచనాల చికిత్సలోవాడే ఔషధ సీసాలు, మాత్రలు ఇంట్లో దొరికాయి. ఐదు రోజుల క్రితమే చిన్నారుల కుటుంబం ఈ ప్రాంతంలో అద్దెకు దిగిందని స్థానికులు చెప్పారు. చిన్నారుల తండ్రి ఆటో రిక్షా నడిపేవారని, దాన్నిఎవరో దొంగలించడంతో పని కోసం కొద్దిరోజులు వేరేచోటుకు వెళ్లాడని స్థానికులు చెప్పారు. 

మరిన్ని వార్తలు