ఆగని పులుల దాడులు, వ్యక్తి మృతి

12 Mar, 2016 17:06 IST|Sakshi

తమిళనాడుః అటవీ ప్రాంతాల్లో పులల దాడులు ఆగడం లేదు. అటుగా వచ్చే ఏ వ్యక్తినీ వదలడం లేదు. దీంతో ఎప్పుడు ఏ పులి పంజా విసురుతుందోనని ఆయా ప్రాంతాల్లో నివసించేవారు నిత్యం భయాందోళనలకు గురౌతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు పులుల బారిన పడి స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జార్ఘండ్ కు చెందిన ఓ టీ ఎస్టేట్ కార్మికుడు మృత్యు వాత పడంటం దేవరసోలై ప్రాంతంలో కలకలం రేపింది.

దేవరసోలై  టీ ఎస్టేట్ లో పనికి వెళ్ళిన 53 ఏళ్ళ మాగు.. పులి దాడికి బలైన ఘటన స్థానికంగా ఆందోళన నింపింది. జార్ఖండ్ కు చెందిన మాగు.. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో అతడి జాడకోసం బంధువులు, సహ కూలీలు తీవ్రంగా వెతికారు. రాత్రంగా వెతికినా లాభం లేకపోయింది. అయితే శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించిన అటవీ అధికారులు పోలీసులకు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో గతరాత్రి కనపడకుండా పోయిన మాగు... పులి దాడికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

అడవిలోని ఓ బురదగా ఉన్న ప్రాంతంలో పులి కాళ్ళ గుర్తులను గమనించిన అధికారులు.. మాగు మెడపై పులి పళ్ళగాట్లను కూడ కనుగొన్నారు.  దీంతో మాగు... పులి దాడిలో చనిపోయినట్లుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాగు మరణంతో స్థానికులు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో పులులతో ఎదురౌతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదంటూ అటివీ అధికారులపై మండిపడ్డారు. అదే ప్రాంతంలో ఆరునెలల క్రితం ఓ మహిళ పులిబారిన పడి చనిపోయిందని, ఆ తర్వాత ఆ పులి కూడ తుపాకీ దెబ్బకు మరణించిందని అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో గ్రామస్థులు, అన్ని పార్టీల నాయకులు ఓ సమావేశం నిర్వహించి, పులి దాడుల నిర్మూలనకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు