ధూమపాన ప్రియుల జేబుకు చిల్లు

1 Mar, 2016 03:32 IST|Sakshi
ధూమపాన ప్రియుల జేబుకు చిల్లు

వరుసగా ఐదో ఏడాదీ కేంద్ర బడ్జెట్‌లో సిగరెట్లపై పన్ను వడ్డించారు. వాటితోపాటు ఇతర పొగాకు ఉత్పత్తులపైనా ఎక్సైజ్ పన్నును 15 శాతం వరకూ పెంచారు. ఇందులో ఒక్క బీడీలకు మాత్రం మినహాయింపునిచ్చారు. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు పన్ను పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్‌లో పేర్కొన్నారు. 65 మిల్లీమీటర్ల (ఎంఎం)లోపు పొడవున్న ఫిల్టర్, ఫిల్టర్ రహిత సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ. 70 నుంచి రూ.215కు పెంచాలని ప్రతిపాదించారు. 65-70 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ రహిత, 70-75 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ సిగరెట్లపై పన్నును రూ.110 నుంచి రూ.370కి పెంచాలని... 65-70 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ సిగరెట్లపై పన్నును రూ.70 నుంచి రూ.260కి పెంచాలని ప్రతిపాదించారు.

 

మిగతా కేటగిరీల్లో ప్రతి వెయ్యి సిగరెట్లపై పన్నును రూ.180 నుంచి ఏకంగా రూ.560కి పెంచాలని పేర్కొన్నారు. గుట్కా, ఖైనీ, జర్దాలపై పన్నును 70 శాతం నుంచి 81 శాతానికి పెంచనున్నారు. మరోవైపు దీనిపై సిగరెట్ పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్థాయి పెంపుకారణంగా ప్రజలు ఇతర ప్రమాదకర పొగాకు ఉత్పత్తుల వైపు మళ్లుతారని, సిగరెట్ల అక్రమ రవాణాకూ కారణమవుతుందని పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు