మంత్రి ఫోన్‌కాల్.. గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకుంది!

21 Mar, 2017 18:31 IST|Sakshi
మంత్రి ఫోన్‌కాల్.. గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకుంది!
డెహ్రాడూన్: ఓ మంత్రికి చేసిన ఫోన్ కాల్ మహిళపై లైంగిక దాడిని అడ్డుకుంది. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశ్ పంత్ సత్వరమే స్పందించి ఓ మహిళను గ్యాంగ్ రేప్ నుంచి తప్పించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఆర్టీఐ కేసు విచారణ నిమిత్తం ఓ జంట( భార్యభర్తలు) ఆదివారం రాత్రి డెహ్రాడూన్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసుకి వచ్చింది. రాత్రి ఇక్కడే ఉండిపొమ్మని డైరెక్టరేట్ ఆఫీసు ఉద్యోగులు వారికి చెప్పారు. 
 
రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ దంపతులు డిన్నర్ చేసి నిద్ర పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆఫీసు స్టాఫ్ కాల్ చేయగానే మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. ఆపై నలుగురు కలిసి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆపై గ్యాంగ్ రేప్ చేసేందుకు యత్నించారు. వివాహిత ప్రతిఘటించడంతో దంపతులిద్దరిపై నిందితులు బౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళ భర్త వెంటనే ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్ పంత్‌కు కాల్ చేసి తమను రక్షించాలని కోరాడు. మంత్రి ప్రకాశ్ పంత్ ఎస్‌ఎస్‌పీ స్వీటీ అగర్వాల్‌కు కాల్ చేసి మహిళపై దురాగతాన్ని అడ్డుకుని నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. 
 
సిబ్బందితో సహా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసుకి వెళ్లిన అగర్వాల్.. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారిపై 354(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందుతులలో జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరి సింగ్ పెత్వాల్ లు డైరెక్టరేట్ ఉద్యోగులని, జగదీశ్ సింగ్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతంటాడని స్టేషన్ ఆఫీసర్ వివరించారు. బాధితులకు సాయం చేసేందుకు ఫోన్‌లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి ప్రకాశ్ పంత్ తెలిపారు.
మరిన్ని వార్తలు