అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..

25 May, 2017 17:05 IST|Sakshi
అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..

న్యూఢిల్లీ: ఆమెకు నిజంగా ప్రాణం లేచివచ్చినట్లయింది. భయం ఎగిరిపోయి కొత్త ఆశలు ఒడిలో చేరినట్లయింది. తన దయనీయ పరిస్థితి నుంచి బయటపడతానా.. తిరిగి ఎప్పటి జీవితంలో అడుగుపెడతానా.. తన దేశ స్వేచ్ఛా వాయువులను పీల్చే అవకాశం వస్తుందా.. ఆ అవకాశం వచ్చేలోగా ఎలాంటి ఉపద్రవం తనను ముంచివేస్తుందో అనే ఆందోళనలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. దాయాది దేశం దాటి భారత గడ్డపై అడుగుపెట్టిన మరుక్షణమే ఆమె అడుగు ఓ క్షణం ఆగిపోయింది. అమాంతం తన తల్లి పాదాలను మొక్కినట్లుగా భారతదేశ మట్టిని మనస్ఫూర్తిగా తాకి నమస్కారం చేసింది.


పాక్‌ వాఘా సరిహద్దు గుండా తన మాతృదేశం(భారత్‌)లోకి సగర్వంగా అడుగుపెట్టింది. పాక్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా గురువారం తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్‌ అధికారులు ఒకపక్క, భారత హైకమిషన్‌కు చెందిన అధికారులు మరోపక్క, ఆమెకు తోడుగా రాగా వాఘా సరిహద్దు దాటి దేశంలోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆమె ముందుగా భారత్‌ మట్టికి వందనం సమర్పించుకుంది. అనంతరం బయలుదేరిన ఆమె తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించింది. ఒక రోజు తర్వాత ఆమెను ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి పంపించనున్నారు. ఈ నెల(మే) ప్రారంభంలో ఇస్లామాబాద్‌ వెళ్లిన ఉజ్మాను తాహిర్‌ అలీ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్నాడు.

అనంతరం ఆమె ట్రావెలింగ్‌ పేపర్లు తీసుకెళ్లి అక్కడే ఉండిపోయేలా ప్లాన్‌ చేశాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. వీరిద్దరికి అంతకుముందే మలేషియాలో పరిచయం ఉందంట. ఆ మేరకే పాక్‌ వెళ్లిన ఆమెను తాహిర్‌ బలవంతంగా వివాహం చేసుకొని వారంలోనే నరకంగా చూపించడంతో ఆమె నేరుగా భారత్‌ హైకమిషన్‌కు వెళ్లి సాయం కోరడం, అనంతరం ఇస్లామాబాద్‌ హైకోర్టు కూడా ఉజ్మా భారత్‌ వెళ్లేందుకు అనుమతించడంలాంటివి చకచకా జరిగిపోవడంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకుంది. దాదాపు తనకు నరకంలోకి పోయి వచ్చినట్లయిందని ఆమె తన అనుభవాన్ని చెప్పింది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ఆమె స్వాగతం అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు