‘వందే భారత్‌’ కొనసాగుతుంది: విదేశాంగ శాఖ

22 May, 2020 05:45 IST|Sakshi

న్యూఢిల్లీ:  విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘వందే భారత్‌’ కార్యక్రమం కొనసాగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ కార్యక్రమ రెండో దశ మే 22తో ముగియనుంది. అయితే, అది జూన్‌ 13 వరకు కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నానికి వివిధ దేశాల నుంచి 23,475 మందిని భారత్‌కు తీసుకువచ్చామన్నారు.జూన్‌ 13 తరువాత మూడో దశ ‘వందేభారత్‌’ కార్యక్రమం ఉంటుందన్నారు. అమెరికా, యూరోప్‌ దేశాలకు కూడా విమానాల సంఖ్యను పెంచుతాం’ అని వివరించారు. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, పెరు, మంగోలియా తదితర దేశాల నుంచి కూడా భారతీయులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 98 దేశాల్లోని 2.59 లక్షల మంది భారతీయులు స్వదేశం వచ్చేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు.   

వెయ్యి రెట్లు పెరిగిన కోవిడ్‌ పరీక్షలు!
కోవిడ్‌ మహమ్మారికి కళ్లెం వేసే క్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌) గణనీయమైన ప్రగతి సాధించింది. ఒక్కరోజులో చేయగల పరీక్షల సంఖ్యను రెండు నెలల్లోనే వెయ్యి రెట్లు పెంచుకోగలిగామని తెలిపింది. 20వ తేదీ ఉదయం తొమ్మిద గంటలకు మొత్తం 25,12,388 పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్‌  తెలిపింది. రెండు నెలల క్రితం ఒక రోజులో చేయగల పరీక్షల సంఖ్య కేవలం వంద ఉండగా..ఇప్పుడదని లక్షకు చేరుకుందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు