శ్రీనగర్‌ హోటల్‌ ఔదార్యం

27 Feb, 2019 17:24 IST|Sakshi

శ్రీనగర్‌లో చిక్కుకున్న టూరిస్టుల పట్ల స్థానిక హోటల్‌ ఔదార్యం

పరిస్థితి చక్కబడేవరకు ఉచిత వసతి, భోజనం

శ్రీనగర్‌ : భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్యయుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీనగర్‌ సహా మరికొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.  దీంతోపాటు శ్రీ నగర్-జమ్మూ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. దీంతో పలువిమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న  దేశీయ ప్రయాణికులు, టూరిస్టులను ఆదుకునేందుకు శ్రీనగర్‌లోని ఒక హోటల్‌ ముందుకు వచ్చింది. 

శ్రీనగర్‌  నగరం నడిబొడ్డున జవహర్ నగర్‌లో ఉన్న హోటల్ ది కైసార్  తన ఔదార్యాన్ని ప్రదరశించింది. కశ్మీర్‌ లోయను సందర్శించడానికి వచ్చి  ఇబ్బందుల్లో చిక్కుకున్న దేశీయ టూరిస్టులకు ఉచిత వసతి. భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితి మెరుగుపడేంతవరకు ఈ అవకాశాన్ని అందిస్తామని వెల్లడించింది. శ్రీనగర్‌లో చిక్కుకున్న పర్యాటకులు హోటల్ నంబర్ 9999059079,  9868270376 లలో సంప్రదించవచ్చని  :ఫేస్‌బుక్‌ ద్వారా  తెలిపింది. కాశ్మీర్లో ఉన్న పరిస్థితులను బట్టి, పర్యాటకులకు ఉచిత వసతి , ఆహారాన్ని అందిస్తున్నామని హోటల్ ఛైర్మన్ షేక్ బషీర్ అహ్మద్ చెప్పారు. మరోవైపు 9 విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు డీజీసీఏ ప్రకటించింది.  జమ్ము, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్టా‍ల్లోని విమాన సర్వీసులను పునరుద్ధరించినట్టు డీజీసీఏ అధికారి  తెలిపారు.  

కాగా బుధవారం ఉదయం కాశ్మీర్‌ బుద్గం జిల్లాలో భారతీయ వైమానిక దళానికి చెందిన జెట్ కూలిపోయింది. దీంతో శ్రీనగర్ సహా జమ్ము, షిమ్లా, కాంగ్రా, కులుమనాలి, పిత్తోడ్‌గఢ్‌, అమృత్‌సర్‌, డెహ్రాడూన్, చండీగఢ్, పఠాన్‌కోట్‌,  విమానాశ్రాయాల వద్ద  ఫిబ్రవరి 27నుంచి మే 27వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిని సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు