‘రైతు రుణాలకు ఆ నిబంధన తొలగించాలి’

28 Nov, 2019 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ : రైతుల సిబిల్‌ స్కోర్‌ ప్రాతిపదికపైనే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీవో అవర్‌లో ఈ అంశంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి రైతులకు సకాలంలో రుణం లభించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషిస్తుంటాయని అన్నారు. అయితే వ్యవసాయ రుణాల మంజూరీకి సంబంధించి ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసిన మార్గదర్శకాలలో సిబిల్‌ స్కోర్‌ అత్యంత ఆక్షేపణీయమైనదని పేర్కొన్నారు. 

సిబిల్‌ స్కోర్‌ ప్రాతిపదికపైనే రుణాలు మంజూరు చేయాలన్న నిబంధన కారణంగా చాలా మంది రైతులు రుణాలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పారు.  రుణాల కోసం దరఖాస్తు  చేసుకున్న రైతులకు సిబిల్‌ నమోదైన లావాదేవీల ప్రాతిపదికన డిఫాల్టర్లుగా  చూపుతూ  బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు రైతులకు మేలు చేయకపోగా.. వారిని ఇక్కట్ల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మన దేశంలో వ్యవసాయరంగం పూర్తిగా వర్షాధారమని.. వరదలు, వడగళ్లు, కరువు, కాటకాలు, వాతావరణంలో సంభవించే ఆకస్మిక పరిణామాల కారణంగా 75 శాతం నుంచి 80 శాతం రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల రైతులు పంట నష్టపోయి.. వ్యవసాయ రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా  మిగిలిపోతున్నారని చెప్పారు. సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్న నిబంధంగా ఏ విధంగా సహేతుకం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనను తక్షణమే తొలగించాలని.. విశ్వసనీయత ప్రాతిపదికపైనే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు