వైరల్‌ వీడియోతో 90 ఏళ్ల వృద్ధుడి ఆచూకీ లభ్యం

13 Jun, 2018 20:34 IST|Sakshi

షోలాపూర్‌/ముంబై: రోజురోజుకి మనుషుల మధ్య బంధాలు పలుచనైపోయి.. సొంత వారినే కాదనుకునే ఈ రోజుల్లో ఓ పోలీసు చేసిన పని అందరిచేత మన్ననలు అందుకుంటోంది. ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడికి పోలీసు స్వయంగా అన్నం తినిపించడంతో ఆ వార్త వైరల్‌ అయింది. అది కాస్తా తప్పిపోయిన ఆ వృద్ధుడిని తిరిగి సొంత గూటికి చేర్చింది. వివరాలు.. ముంబైకి చెందిన భికాజీ పన్సారే (90)  కొన్ని నెలల క్రితం షోలాపూర్‌ పట్టణంలోని బైకుల్లా ప్రాంతంలో తప్పిపోయాడు.

అప్పటినుంచి కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. బైకుల్లా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం షోలాపూర్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నస్రుద్దీన్‌ షైక్‌ రోడ్డు పక్కన పడి ఉన్న ఓ వృద్ధుడికి అన్నం తినిపించాడు. పోలీసు చేస్తున్న గొప్ప పనిని వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. అది చక్కర్లు కొడుతూ.. పన్సారే ఇంటి పక్కనే నివాసముండే మరో కానిస్టేబుల్‌ బుజ్‌బల్‌ కంటబడింది. వృద్ధుడి కుటుంబ సభ్యులకు ఆ వీడియోని చూపించగా వారు పన్సారేని గుర్తించారు. బుజ్‌బల్‌ హుటాహుటిన బైకుల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు వృద్ధుడి ఆచూకీ కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు