ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్‌

10 Jun, 2018 04:03 IST|Sakshi

గ్యాంగ్‌స్టర్‌ రాజేశ్‌ సహా నలుగురు హతం  

న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ రాజేశ్‌ భారతీ సహా నలుగురు నేరస్తుల్ని కాల్చిచంపారు.  గాయపడ్డ మరో నేరస్తుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఛత్తర్‌పూర్‌ దగ్గర్లోని చందన్‌హోలా గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో రాజేశ్‌ గ్యాంగ్‌ భేటీకానుందని పక్కా సమాచారం అందిందని ఢిల్లీ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు.. ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని గ్యాంగ్‌ సభ్యుల్ని హెచ్చరించారు. అయినా, నేరస్తులు పోలీసులపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు.

ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో రాజేశ్, విద్రోహ్, ఉమేశ్, భీకూ, కపిల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు నేరస్తులు మార్గమధ్యంలో చనిపోయారు. రాజేశ్‌ గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో హెడ్‌కానిస్టేబుల్‌ గిర్‌ధర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలం నుంచి రెండు .30 బోర్‌ తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన రాజేశ్, విద్రోహ్‌లపై రూ.లక్ష, ఉమేశ్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. ఈ నేరస్తులపై హత్య, బెదిరింపులు, కార్ల హైజాకింగ్, దోపిడీ వంటి 25 కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు