ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఆటకట్టు!

29 Jan, 2018 17:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘రోగులు చస్తున్నా సరే వైద్యం చేయడానికి ముందుకు రారు ప్రభుత్వ వైద్యులు. రోగులు చచ్చాక కూడా వైద్యం చేస్తారు కార్పొరేట్‌ వైద్యులు’ అన్న వాక్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యుల కాసుల కక్కుర్తిని సూచిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిని పక్కన పెడితే దేశంలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి, రోగుల హక్కుల పరిరక్షణ కోసం ఓ ఆన్‌లైన్‌ వేదిక త్వరలోనే అందుబాటులోకి వస్తోంది.

‘ప్రైవేట్‌హాస్పటల్స్‌వాచ్‌. ఆర్గ్‌’ అనే పేరుతో వస్తున్న ఆ ఆన్‌లైన్‌ వేదిక సైట్‌ ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది. రోగుల హక్కులపై ఇటీవల రెండు రోజులపాటు జరిగిన దక్షిణ ఆసియా స్థాయి వర్క్‌షాప్‌ సందర్భంగా సైట్‌పేరును ఖరారు చేశారు. ముంబైకి చెందిన సతి, సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కెన్యా దేశాలతోపాటు భారత దేశంలోని 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 60 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి రంగంలో జరగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం కోసం ఈ వెబ్‌సైట్‌ను తీసుకొస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో చదువుకొని, ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తీసుకొని, పన్ను రాయతీలు అనుభవిస్తూ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారుల్లో నడుస్తున్నాయని ‘జన్‌ స్వస్థ్‌ అభియాన్‌’ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ అభయ్‌ శుక్లా ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులు జవాబుదారిగా వ్యవహరించేందుకు తమ వెబ్‌సైట్‌ పబ్లిక్‌ వేదికగా పనిచేస్తుందని, ఆస్పత్రుల అన్యాయాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ల రూపంతో వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు