జూలై వరకు ఎందుకు?

3 Apr, 2018 02:57 IST|Sakshi

పది గణితం పరీక్షపై సీబీఎస్‌ఈకి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: ఇటీవల సీబీఎస్‌ఈ పదో తరగతి గణితం పేపర్‌ లీకైన నేపథ్యంలో ఆ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సంస్థను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ లీకేజీ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ సోషల్‌ జ్యూరిస్ట్‌ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. గణితం పేపర్‌ ఎక్కడెక్కడ లీకయిందో పరిశీలిస్తున్నామనీ, జూలైలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశముందని సీబీఎస్‌ఈ చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య విద్యార్థులను ముళ్లపై కూర్చోబెట్టడం లాంటిదేననీ, అసలు పరీక్ష నిర్వహణకు జూలైదాకా ఆగాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. గణితం పరీక్షను మళ్లీ నిర్వహించడంపై తమ అభిప్రాయాన్ని ఏప్రిల్‌ 16లోగా తెలియజేయాలని సీబీఎస్‌ఈ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.   

ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలో సీబీఎస్‌ఈ పరీక్షలు
పది, పన్నెండో తరగతి పరీక్ష పేపర్లు లీకైన నేపథ్యంలో సీబీఎస్‌ఈ దేశవ్యాప్తంగా సరికొత్త విధానంలో సోమవారం పరీక్షల్ని నిర్వహించింది.  పరీక్షకు కేవలం 15 నిమిషాల ముందు ఎన్‌క్రిప్టెడ్‌ ప్రశ్నపత్రాన్ని నిర్వాహకుల ఈ–మెయిల్‌కు సీబీఎస్‌ఈ పంపగా, వారు దాన్ని డౌన్‌లౌడ్‌ చేసుకున్నారు. కొన్నిచోట్ల బంద్‌ కారణంగా, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది.  

మరిన్ని వార్తలు