అక్కడ ఎక్కడినుంచో ఎందుకు తెచ్చారు?

9 May, 2017 15:12 IST|Sakshi
అక్కడ ఎక్కడినుంచో ఎందుకు తెచ్చారు?

ఓ భారీ కుట్రను వెల్లడించడానికి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి సస్పెండయిన ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా హాజరయ్యారు. కేజ్రీవాల్ బంధువుల పేరు మీద జరిగిన భూ కుంభకోణాలు, మంత్రుల విదేశీ పర్యటనలు తదితర అంశాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా అటు నుంచి అటే అసెంబ్లీ సమావేశానికి ఆయన వచ్చేశారు. ఇక ఈ సమావేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రస్తావించారు. ఆప్ నాయకులతో కలిసి తాను ఈవీఎంల గురించి పలు ప్రశ్నలతో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లానని, అయితే తమకు అక్కడినుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని ఆమె చెప్పారు.

అయినా ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ఎక్కడో రాజస్థాన్ నుంచి ఈవీఎంలు తేవాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. విచారణ కోసం ఈవీఎంలను స్వాధీనం చేసుకోవాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిందని, అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఏకంగా 2446 ఈవీఎంలను సీజ్ చేసిందని చెప్పారు. ఎన్నికలలో ఓడిపోయినందుకో లేదా ప్రచారం కోసమో ఈవీఎంల అంశాన్ని లేవనెత్తడం లేదని ఆమె చెప్పారు. పదేళ్ల పాటు ఎంసీడీలో దుష్ట పరిపాలన చేసిన తర్వాత బీజేపీ మళ్లీ ఈ స్థాయిలో మెజారిటీ సాధిస్తుందని ఎవరూ అనుకోలేదని, అందువల్ల ఇందులో వాస్తవం ఏంటో బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో అన్న అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ అసెంబ్లీలో చేసి చూపించారు.

మరిన్ని వార్తలు