Sakshi News home page

రైల్వేస్టేషన్లో బాలకార్మికుల పట్టివేత

Published Tue, May 9 2017 3:09 PM

రైల్వేస్టేషన్లో బాలకార్మికుల పట్టివేత - Sakshi

నెల్లూరు(అర్బన్‌): బీహార్‌ నుంచి బెంగళూరుకి బాలకార్మికులను తరలిస్తుండగా సోమవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చైల్డ్‌హెల్ప్‌లైన్‌ 1098కి బాలలను తరలిస్తున్నట్టు  ఫోన్‌ వచ్చింది. కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కౌన్సిలర్‌ మదన్‌మిశ్రా వెంటనే బాలల సంరక్షణాధికారి సురేష్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు 10 గంటల ప్రాంతంలో బీహార్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న రైలును పోలీసులు సోదాచేశారు. ఎఫ్‌–5బోగీలో ఒక బాలికతో పాటు 6 మంది బాలురు ఉండటంతో పట్టుకున్నారు. వారిని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్నారు.

అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్‌ రవిశంకర్, జీఆర్పీ సీఐ జి.దశరథరామారావులు విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌లో తల్లిదండ్రులకు డబ్బులిచ్చి బెంగళూరులో పనిచేయించేందుకు ఇద్దరు వ్యక్తులు వారిని తరలిస్తున్నారని తెలిపారు. వారు కూడా పిల్లలకు బాగా తెలిసిన వారేనన్నారు. అయినప్పటికీ వెట్టిచాకిరి కోసం బాలలను బెంగళూరుకు తరలించడం నేరమన్నారు. అందుకే తాము వీరిని పట్టుకుని సీడబ్లు్యసీ కమిటీకి అప్పగిస్తున్నామని తెలిపారు. బాలలను పోలీసు సంరక్షణలో హోంకి తరలించారు. పిల్లలకు ఆహారాన్ని అందించారు.  పట్టుబడిన బాలకార్మికుల్లో క్రాంతిథోరి(12)అనే బాలికతో పాటు శంకర్‌పున్‌థోరి(13),మోహన్‌థోరి(16),లాలన్‌కుమార్‌థోరి(14),నందకుమార్‌థోరి(12),రాహుల్‌కుమార్‌థోరి(12), అఖిలేష్‌కుమార్‌(12) ఉన్నారు. 
 
 

Advertisement

What’s your opinion

Advertisement