ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయా : పాక్‌ మంత్రి

7 Aug, 2019 09:39 IST|Sakshi

సుష్మాస్వరాజ్‌ మృతిపై పాక్‌ మంత్రి సంతాపం 

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) మరణం పట్ల పాకిస్తాన్‌ మంత్రి  ఫవాద్‌ చౌద్రీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా హఠాన్మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ‘ ట్విటర్‌లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయాను. హక్కుల కోసం పోరాటే గొప్ప దిగ్గజం ఆమె. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను’ అని ఫవాద్‌ చౌద్రీ ట్వీట్‌ చేశారు.

(చదవండి : సుష్మా హఠాన్మరణం)

కాగా పాకిస్తాన్‌లో హిందూ బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్‌ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్‌లో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని ఇండియన్‌ కమిషనర్‌ను సుష్మా ఆదేశించారు. దీనిపై  ఫవాద్‌ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్‌ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్‌ పాలనలోని కొత్త పాక్‌. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్‌లో బదులిచ్చారు.

సుష్మాస్వరాజ్‌  ట్విటర్‌ను వేదిగా చేసుకుని పలు సమస్యలకు పరిష్కారం చూపారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. సుష్మా స్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్రవేశారు. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చి పలువురి అభినందనలు అందుకున్నారు. సుష్మా ఎటువంటి తారతమ్యాలు లేని రీతిలో సేవలు అందించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

మరిన్ని వార్తలు