ఫొని: హర్రర్‌ను తలపించేలా.. అద్దాలు బద్దలు!

4 May, 2019 12:30 IST|Sakshi

పూరీ: బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గంటకు 175-205 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు ఒడిశా తీరప్రాంతాలను చిన్నాభిన్నం చేశాయి. ఫొని తుపాను, ప్రచండ గాలుల ధాటికి పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఒడిశాలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన ఫొని తుపాను వేగంగా కదులుతూ బెంగాల్‌ దిశగా సాగిపోయింది.

ఫోని తుపాను బీభత్సానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్‌లోని కలింగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ టెక్నాలజీ (కేఐఐటీ)లో ఫొని తుపాను సందర్భంగా వీచిన ప్రచండ గాలులు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి. భీకరంగా వీచిన గాలుల ధాటికి కాలేజీ కిటికీ అద్దాలు అమాంతం బద్దలైపోయాయి. ఈ సందర్భంగా కాలేజీ భవనంలో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. గాలుల ధాటికి అమాంతం బద్దలైన కిటికీ అద్దాలు అక్కడివారిని కాసేపు వణికించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన విద్యార్థులు.. తుపాను సృష్టించిన బీభత్సాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు