మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

4 Mar, 2020 11:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్టాండప్‌ ఇండియా స్కీమ్‌ మహిళా వ్యాపారవేత్తలకు  భారీ ప్రయోజనాలు

న్యూఢిల్లీ: ‘స్టాండప్‌ ఇండియా’ పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81శాతం మంది మహిళలున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.  4 సంవత్సరాల కాలంలో రూ .16,712 కోట్ల విలువైన రుణాలు అందిచినట్టు తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిన ఆరు పథకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.  స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధానమంత్రి జన-ధన్ యోజన (పీఎంజేడీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జెజెబీ), ప్రధానమంత్రి బీమా సురక్షా  యోజన (పీఎంఎస్‌బీవై) పథకాల ద్వారా మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకాలు తోడ్పడ్డాయని ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. గత ఆరు సంవత్సరాల్లో, మంత్రిత్వ శాఖ మహిళల సాధికారత కోసం ప్రత్యేక నిబంధనలు కలిగిన వివిధ పథకాలను ప్రారంభించామని వెల్లడించింది.2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్‌ ఇండియా స్కీమ్‌ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి.  ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్‌ 5న స్టాండప్‌ ఇండియా స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది.  అలాగే ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద మొత్తం రుణగ్రహీతలలో 70 శాతం మహిళలు. కార్పొరేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించే లక్ష్యంతో  పీఎంఎంవై 2015 ఏప్రిల్ 8 న ప్రారంభించింది. ఈరుణాలను వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బిఎఫ్‌సిలు అందిస్తాయి

మరిన్ని వార్తలు