-

ప్రపంచ వేదికపై రామ్‌దేవ్‌ శిష్యుల మ్యాజిక్‌

22 Jan, 2018 16:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రదర్శించే అవకాశం దక్కింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో నిత్యం ఒత్తిడికి గురయ్యే నేతలకు యోగా పాఠాలతో ఉపశమనం కలిగించనున్నారు. వారికి పతంజలి యోగా గురువులు.. ఆచార్య భరద్వాజ్‌, ఆచార్య స్మిత్ యోగాసనాలు నేర్పించనున్నారు‌. ఈ విషయాన్ని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రతినిధి బృందంలో భాగస్వాములైన ఈ ఇద్దరు యోగా గురువులు వచ్చేవారం నుంచి పాఠాలు మొదలుపెడతారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సహా సుమారు 70 మంది ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ దేశాలకు చెందిన ఉన్నతశ్రేణి బ్యాంకర్లు ఇందులో భాగం కానున్నారు.

ప్రపంచ వేదికపై భారత సౌరభం: రమేశ్‌ అభిషేక్‌
భారత సంస్కృతి, వారసత్వాలతోపాటు సాధించిన విజయాలు, భారతీయ వంటకాల రుచులు, యోగాను ప్రదర్శించేందుకు, దానికి ప్రచారం కల్పించేందుకు ప్రపంచ ఆర్ధిక వేదికను వినియోగించుకోనున్నామని  పారిశ్రామిక విధాన, ప్రచార సారథి రమేశ్‌ అభిషేక్‌ చెప్పారు. చైనా తర్వాత ప్రపంచ ఆర్థికవ్యవస్థను అత్యంత ప్రభావితం చేయగలిగే శక్తి భారత్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కూడా బయలుదేరారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్‌. డి. దేవెగౌడ పాల్గొనగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత ఎకానమీ 2.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరి, ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణమించిన నేపథ్యంలో మోదీ దావోస్‌ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. ఎయిర్‌బస్‌, హిటాచి, ఐబీఎమ్‌ వంటి దాదాపు 60 ప్రధాన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఐదు రోజులపాటు జరగనున్నఈ సదస్సులో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి సురేశ్‌ ప్రభు, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతోపాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మోదీ కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ బస చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు