రాహుల్‌ భూకంపం వచ్చి వెళ్లింది: మోదీ

7 Feb, 2017 13:25 IST|Sakshi
రాహుల్‌ భూకంపం వచ్చి వెళ్లింది: మోదీ

న్యూడిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ దేశానికి కాంగ్రెస్‌ చేసేందేమీ లేదని, ఒక్క ఎమర్జెన్సీని గిప్ట్‌గా ఇచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం చేసే సందర్భంగా మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన మోదీ కొంత ఆలోచనతో కొంత ఆవేశంతో మరికొన్నిసార్లు చమత్కరిస్తూ ప్రసంగించారు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందని గతంలో రాహుల్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

గత రాత్రి ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, సరిహద్దుప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చి ప్రకంపనలతో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ మాటలను రాత్రి ఏర్పడిన భూకంపంతో పోలుస్తూ రాహుల్‌ చెప్పిన భూకంపం వచ్చివెళ్లిందని చమత్కరించారు. ఇందిరాగాంధీ దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేశారని, కాంగ్రెస్‌ స్వాతంత్ర్యం తెచ్చిందని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అనగా దేశ భక్తి ఒక్క కాంగ్రెస్‌ కుటుంబం సొంతం కాదని, ఒక్క ఇందిరా కుటుంబవల్ల, కాంగ్రెస్‌ వల్లనో స్వాతంత్ర్యం రాలేదని అన్నారు.

దేశ ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచి దేశానికి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించారని చెప్పారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు శక్తిమంతులేనన్న మోదీ.. చాయ్‌ అమ్మిన తాను ప్రధాని అవడం ప్రజాస్వామ్య, ప్రజాశక్తి బలానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్‌ కావాలంటే తనను విమర్శించవచ్చని, కానీ తన ప్రభుత్వం చేసే మంచి పనులు మెచ్చుకొని తీరాల్సిందేనని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రధానులంతా తమకు అవకాశం ఉన్నమేరకు మంచే చేశారని తెలిపారు.

కాంగ్రెస్‌కు ప్రజాశక్తి అంటే అస్సలు భయం లేదని, లెక్కలేదని దుయ్యబట్టారు. అదే సమయంలో తమకు ఎన్నికలంటే భయం లేదని, తమ ఆలోచన దేశం కోసమే ఉంటుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప బలహీనంగా ఉంటే తీసుకోకపోయేవాళ్లమని స్పష్టం చేశారు. నగదుతోనే అవినీతి ప్రారంభమవుతుందని, నల్లధనం దాచినవారికి ఇదే చివరి అవకాశం అని హెచ్చరించారు.

బినామీ చట్టం విషయంలో వెనుకడుకు వేయబోమని, బినామీ చట్టాన్ని కాంగ్రెస్‌ తొక్కి పట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి టీవీల్లో కనిపించాలనే తపన ఎక్కువని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత దేశం స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు. దేశాన్ని చాలామంది దొంగదారుల్లో కొల్లగొట్టారని, ఇకపై అవినీతికి అన్ని దారులు మూసేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నగదు రహిత లావాదేవీలు మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు.