మ్యాగీ నూడుల్స్కు మరిన్ని పరీక్షలు: సుప్రీం

13 Jan, 2016 12:51 IST|Sakshi
మ్యాగీ నూడుల్స్కు మరిన్ని పరీక్షలు: సుప్రీం

న్యూఢిల్లీ: ఐదు నెలల నిషేధం అనంతరం మళ్లీ మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ను మరిన్ని పరీక్షలకు పంపనున్నారు. మైసూర్లోని ప్రభుత్వ ల్యాబ్కు మ్యాగీ ఉత్పత్తుల శాంపిల్స్ను పంపి పరీక్షించాలని బుధవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మ్యాగీ ఉత్పత్తుల తయారీలో పరిమితులకులోబడి సోడియం రసాయనాలను కలిపారా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ రెగ్యులరేటర్కు సూచించింది. 'మ్యాగీ నూడుల్స్ను యువతరం కొంటున్నారు. వారి రక్షణ విషయంపై మాకు ఆందోళన ఉంది' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మ్యాగీ నూడుల్స్ తయారీలో పరిమితికి మించి సోడియం కలిపారని, ఇవి సురక్షితం కావంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ గత జూన్లో వీటిని నిషేధించింది. కాగా గత నవంబర్లో మూడు ప్రభుత్వ ల్యాబ్లలో నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని తేలిన తర్వాత బాంబే హైకోర్టు వీటిపై నిషేధాన్ని తొలగించింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా మ్యాగీ ఉత్పత్తులకు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు