ప్రయోగ దశలో జికా వ్యాక్సీన్లు!

8 Feb, 2016 01:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను నియంత్రించడంలో భారత్ ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్‌లను తీసుకురానున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వాటిపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది.. ఇవి విజయవంతమైతే భారత్ ప్రపంచ బయోటెక్ రంగంలో అగ్రభాగాన నిలవనుంది.  భారత్ బయోటెక్ ఇలాంటి రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం తెలిసిందే. జికా మన దేశంలో లేనప్పటికీ భారత్ బయోటెక్ ప్రయోగాలు చేపట్టింది.  వ్యాక్సిన్‌కు పేటెంట్ దక్కించుకోవడంతో ఈ ప్రయోగంతో ప్రపంచదేశాల కన్నా భారత్ ముందే ఉందనే చెప్పొచ్చు.

భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. అవి క్లినికల్ పరీక్షలకు సిద్ధమయ్యాయి. వాటిని ముందుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) నిపుణులు ఆమోదించాలి. ‘జికా వైరస్‌కు వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. వైరస్‌ను అడ్డుకోవడంలో ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో పరీక్షించి ముందుకు తీసుకుపోతాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్ బయోటెక్ సంస్థ హెపటైటిస్-బి, పోలియో వైరస్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తక్కువ ధరకే అందరికీ లభ్యమయ్యేలా తయారు చేస్తోందని సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి డయేరియాను అరికట్టేందుకు గాను ‘రోటావాక్’ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధిపరిచింది.

మరిన్ని వార్తలు