'మత్తు'కు దూరంగా మనుషులకు దగ్గరగా

7 Jan, 2018 03:48 IST|Sakshi

మద్యం, మాంసం ముట్టని నిర్మల్‌ జిల్లా గ్రామాలు

ఆదర్శంగా నిలుస్తున్న పాంగ్రా, ఝరి(బి), హిప్నెల్లి, జామ్‌గావ్, వాస్తపూర్‌

ఎక్కడైనా నలుగురు కలిస్తే మద్యం తాగడం, మాంసాహారం తినడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిన రోజులివి. పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా.. మంచైనా, చెడైనా.. మద్యం, మాంసాహార వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. పేద కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మల్‌ జిల్లాలోని పలు గ్రామాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండడమే కాదు సమష్టితత్వం, పరస్పర సహకారంతో అభివృద్ధి బాటన ప్రయాణిస్తున్నాయి. హంగులు, ఆర్భాటాలు వదిలేసి సేవాతత్వంలో నడుస్తూ సరికొత్త బాటను చూపుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మల్‌ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల్లో ఉన్న ఈ గ్రామాలపై ఈ వారం ‘ఫోకస్‌’..
– నిర్మల్‌

నిర్మల్‌ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల పరిధిలోని ఆరేడు తండాలు/గ్రామాలు మద్యపానంపై స్వీయ నిషేధం విధించుకున్నాయి. ఈ ఊళ్లలో మందు సీసాలే కాదు.. కల్లు అమ్మే దుకాణం కూడా కనిపించదు. మేకలు, కోళ్లు కోయడమనే ముచ్చటే ఉండదు. మద్యం, మాంసాహారం గురించి మాట్లాడినా ఆ గ్రామాల ప్రజలు సున్నితంగా తిరస్కరిస్తారు. ఏ నిర్ణయమైనా సంఘటితంగా తీసుకుంటారు. సమష్టిగా గ్రామ అవసరాలు తీర్చుకుంటారు. ఎవరికీ భారం కాకుండా ఊరంతా కలసి సామూహికంగా తమ పిల్లలకు వివాహాలు చేస్తారు. ఇవే వారిని, వారి గ్రామాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ‘మద్యం’ మహమ్మారి జాడ లేకపోవడంతో ఈ గ్రామాల్లో నేరాలు, ఘోరాలు దాదాపుగా లేకపోవడం గమనార్హం.

వాస్తపూర్‌.. ప్రతి ఇల్లు దేవాలయమే
చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి మధ్య గ్రామం వాస్తపూర్‌. బాహ్య ప్రపంచానికి దూరంగా మామడ మండలంలోని తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామ జనం.. ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరంగా ఉంటున్నారు. 450 మంది మాత్రమే ఉన్న ఈ గ్రామస్తులు మద్యం, మాంసాలను ఎప్పుడూ ముట్టకూడదని తమకు తాముగా ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇక ఈ గ్రామంలో ప్రతి ఇల్లూ ఒక దేవాలయమే. అడవిలో ఉన్నా తమ ఇళ్లలో పేడతో అలికి, ముగ్గులు వేసుకుంటారు. ప్రతి శనివారం ఊరంతా కలసి గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో సామూహికంగా భజన నిర్వహిస్తారు. గ్రామంలోకి ఎవరు వచ్చినా.. మర్యాద గా స్వాగతిస్తారు. చేలలో విత్తనాలు చల్లే సమయంలో, శివరాత్రి సమయంలో దీక్షలు చేపట్టి.. కఠిన నియమాలను అనుసరిస్తుంటారు. ఇక వాస్తపూర్‌కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే... ఏ ఎన్నికలు వచ్చినా నిర్మల్‌ నియోజకవర్గ నాయకులు ఈ కుగ్రామం నుంచే ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ కావడం గమనార్హం.

ఏళ్లుగా పాటిస్తున్నాం
‘‘మాది అడవిలో ఉండే ఊరైనా ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరం గా ఉంటున్నాం. ప్రకృతి ఒడిలో ఉండే తమ గ్రామంలో ఏ పండుగ వచ్చినా ప్రతి కుటుంబం పాలు పంచుకుంటుంది. ఉదయం గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో సామూహిక పూజలు చేశాక రోజూ పనులు ప్రారంభిస్తాం..’’    
– గంగారాం పటేల్, వాస్తపూర్‌

పుట్టిన్నుంచి మందు చూడలె..
‘‘నాకిప్పుడు తొంభయ్యేళ్లపైన ఉంటయ్‌. నేను పుట్టినప్పటి నుంచి మద్యం చూడలె. పాంగ్రాలో తరాల కిందనే మందు బంజేసిండ్రు. ఇప్పటికీ మా కొడుకులు, మనుమలు కూడా దూరంగనే ఉంటున్నరు. అదే మా ఊరికి మంచి పేరు తెస్తున్నది..’’     
– కెర్భా పటేల్, పాంగ్రా

మేం అదృష్టవంతులం..
‘‘మా పాంగ్రా గ్రామపంచాయతీలోని బాకోట్, పాంగ్రా, సౌనా ఈ మూడు ఊళ్లూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటాయి. ఇలాంటి గ్రామాల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. మద్యానికి దూరంగా ఉండటం వల్లే ఇప్పటిదాకా గొడవలు, కేసులేవీ లేవు..’’ 
– ముక్తాబాయి, సర్పంచ్, కుభీర్‌ మండలం సౌనా 

యువకులు, మహిళలు ముందుకువచ్చి..
‘‘ఒకప్పుడు మా ఝరి (బి) గ్రామం మద్యం కారణంగా ఇబ్బందులు పడింది. పరిస్థితి గొడవలు, హత్యల వరకూ వెళ్లింది. యువత, మహిళలు ముందుకువచ్చి పట్టుబట్టడంతో మద్యానికి దూరమైంది..’’ 
– ఆనంద్, నచికేత యూత్, ఝరి(బి) గ్రామం

మూడు తరాల నుంచి పచ్చగా..
నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుభీర్‌ వెళ్లే మార్గంలోని చిన్న గ్రామం పాంగ్రా. ఇక్కడ దాదాపుగా మూడు తరాల నుంచి మద్యం, మాంసం వినియోగం బంద్‌. ఇప్పటి యువత సైతం మద్యపానానికి దూరంగా ఉండటం విశేషం. గ్రామంలో ఉన్నా, చదువుకునేందుకు పట్టణాలకు వెళ్లినా వారు ఊరి పద్ధతిని వీడడం లేదు. వేరే గ్రామం నుంచి వచ్చిన కోడళ్లు, అల్లుళ్లూ ఈ ‘మర్యాద’ను పాటిస్తుంటారు. ‘‘మా తాత చెప్తుండె.. మన ఊళ్లో జమానా నుంచి మందు తాగుడు, మాంసం తినుడు లేదురా అని.. ఇట్ల మూడు పిడిల (తరాల) కెళ్లి మా ఊళ్లె తాగుడు తినుడు ముచ్చట్నే లేదు..’’ అని పాంగ్రా గ్రామ మాజీ సర్పంచ్‌ దిగంబర్‌ పటేల్‌ తమ ఊరి గొప్పదనాన్ని వివరించారు. 

ఎటు చూసినా పచ్చగా..
పత్తి, మొక్కజొన్న, శనగ, గోధుమ పంటలతో ఈ గ్రామం ఎటు చూసినా పచ్చగా కళకళలాడుతుంటుంది. గ్రామంలో వివిధ కులాల వాళ్లున్నా అందరూ ఒక్కటిగానే ఉంటారు. ఈ ఊరికున్న ప్రత్యేకత ‘ఏకముఖి దత్తాత్రేయుడు’గా పిలుచుకునే ఆలయం. గ్రామశివారులో నిర్మించిన ఈ దత్తాత్రేయ ఆలయమే పాంగ్రాను కలిసికట్టుగా నడిపిస్తోంది, వ్యసనాలకు దూరంగా ఉంచుతోంది. దత్తాత్రేయ బోధనలను పాటించే గురువు ‘మహానుభావు’ మార్గాన్ని ఈ గ్రామ ప్రజలు అనుసరిస్తున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉంటూ కలసికట్టుగా జీవించడమే తమ మహానుభావు మతమని వారు చెబుతుంటారు. గ్రామంలో దసరా నవరాత్రులు, దత్తపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 

బాకోట్, సౌనా గ్రామాల్లోనూ..
పాంగ్రా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలైన బాకోట్, సౌనా గ్రామాలు సైతం ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకున్నాయి. ఎంత పెద్ద పండుగైనా, ఏ వేడుకైనా సరే ఈ గ్రామాల్లోనూ మద్యమాంసాలను ముట్టుకోరు. అసలు ఇప్పటిదాకా తమ పంచాయతీ పరిధిలోని పాంగ్రా, బాకోట్, సౌనా ఊళ్లల్లో వాటి ముచ్చటే రాలేదని గ్రామ సర్పంచ్‌ ముక్తాబాయి చెబుతున్నారు. ఏదైనా కార్యం ఉంటే లడ్డూ, బూందీ వంటి తీపి పదార్థాలతోనే వేడుకలను నిర్వహించుకుంటామని అంటున్నారు. మద్యం లేనందునే తమ గ్రామాల్లో గొడవలు లేవని, ఇప్పటిదాకా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు లేవని చెబుతున్నారు.

అమృత నిలయం.. జామ్‌గావ్‌
కుభీర్‌ మండల కేంద్రం నుంచి కొండలు, గుట్టలు దాటుకుని వెళ్తే మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది జామ్‌గావ్‌. ఇక్కడ మద్యమనే మాటే లేదు.. మాంసం వినియోగం తెలియని ఇళ్లు ఉన్నాయి. ముప్పై ఏళ్ల కిందే ఈ గ్రామం భక్తిని తమ మార్గంగా ఎంచుకుంది. ముంబై లో పాండురంగ అఠావలే ప్రారంభించిన స్వాధ్యాయ పంథాను జామ్‌గావ్‌ అందిపుచ్చుకుంది. ఉమ్మడి ఏపీ లోనే తొలిసారిగా 1996లో స్వాధ్యాయ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అమృతాలయం నిర్మించడం గమనార్హం. దీనిని కేంద్రంగా చేసుకుని.. ఆ ఊళ్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. నలభయ్యేళ్ల కిందటే ప్రతి ఇంటి కి మరుగుదొడ్డి నిర్మించుకోవడం గమనార్హం. గ్రామస్తులంతా ఉపాధి పథకంలో కలసి పనిచేసి, వచ్చిన డబ్బులతో హనుమాన్‌ ఆలయాన్ని నిర్మించుకున్నారు. పండుగలప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి జరుపుకోవడం, మంచిని ప్రచారం చేయడం, ఏడాదికోసారి ఊరంతా కలసి ఒక చేనులో పంట పండించి ప్రత్యేక రోజుల్లో వినియోగించడం వంటివి జామ్‌గావ్‌ మరిన్ని ప్రత్యేకతలు.

అందరం కలిసుంటాం..
‘‘మా జామ్‌గావ్‌లో ఎలాంటి భేదభావాలు లేవు. అందరం ఒకటేనన్న భావన తో కలసి ఉంటాం. మద్యమాంసాల ముచ్చటే లేదు. రాజకీయం, ప్రచారం, హంగూ ఆర్భాటం లేకుండా భక్తి మార్గంలోనే నడుస్తాం. ఏళ్లుగా ఇలాగే కలసి ఉంటున్నం..’’ 
– పెద్దకాపు చిన్నన్న, జామ్‌గావ్‌

మరిన్ని వార్తలు