మావాళ్లను స్వదేశానికి రప్పించండయ్యా!

26 Jun, 2018 08:06 IST|Sakshi
కలెక్టరేట్‌లో బాధితుల కుటుంబ సభ్యులు

ఏజెంట్‌ మోసానికి గురైన నర్సాపురం వాసులు

మలేషియా జైలులో మగ్గుతున్న వైనం

సాయం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసిన బాధితుల కుటుంబ సభ్యులు

ఏలూరు (మెట్రో): అయ్యా.. ఏజెంట్‌ ఉచ్చులోపడి మావాళ్లు మోసపోయారు.. వీసా కాలం ముగియడంతో మలేషియా జైలులో బందీలుగా చిక్కుకున్నారు. వారిని విడిపించి స్వదేశానికి తీసుకురండయ్యా అంటూ నర్సాపురానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన మీకోసంలో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.

ఏజెంట్‌ మాటలు నమ్మి..
నర్సాపురానికి చెందిన యర్రంశెట్టి సంతోష్‌కుమార్, కొమ్మిన ప్రవీణ్‌బాబు, వేగి కిరణ్‌కుమార్, కొత్తపల్లి చిట్టిబాబు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈమేరకు స్థానిక ఏజెంట్‌ కొప్పినీడి స్వామినాయుడును సంప్రదించారు. ఉపాధి కోసం మలేషియా పంపిస్తున్నట్లు వారందరికి స్వామినాయుడు వివరించాడు. వీసా చెన్నై ఎయిర్‌పోర్టులో ఇస్తామని ఏజెంట్‌ చెప్పడంతో నిబంధనలు తెలుసుకోకుండా, వీసా ఏవిధంగా ఉందో కూడా పరిశీలించకుండా ఏజెంట్‌ మాటలు నమ్మి విజిటింగ్‌ వీసాతో మలేషియా వెళ్లారు. అయితే వీసాగడువు ఒక సంవత్సరంతో ముగియడంతో మలేషియా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ అయినవాళ్లు లేక, న్యాయం చేసే వాళ్లు దొరకక మలేషియా జైలులో వీరు మగ్గుతున్నారు.

కాళ్లరిగేలా తిరుగుతున్న కుటుంబ సభ్యులు
తమవాళ్లు మలేషియా జైలులో బందీలుగా మారారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెలిసిన ప్రతి ఒక్కరిని కలిసి వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను మీ కోసం కార్యక్రమంలో కలుసుకుని సమస్యను విన్నవించుకున్నారు. తమవారిని స్వదేశానికి రప్పించి ఆదుకోవాలని సంతోష్‌కుమార్‌ సోదరి మాధురీకళ, ప్రవీణ్‌బాబు సోదరుడు విజయ్, కిరణ్‌కుమార్‌ తల్లి అన్నపూర్ణ, చిట్టిబాబు తండ్రి భాస్కరరావు కలెక్టర్‌ భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ను కలిసి సమస్యను వివరించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.

మరిన్ని వార్తలు