ఏకాంతంలోనే గీస్తానంటే కుదరదు!

21 Dec, 2015 03:19 IST|Sakshi
ఏకాంతంలోనే గీస్తానంటే కుదరదు!

ఈ డిసెంబరు 24న ఆర్టిస్టు మోహన్ 65వ పుట్టినరోజు కావడంతో పాటు, త్వరలో ఆయన రచనలతో బొమ్మలతో 20 సంకలనాలు వెలువడనున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ.
 
 చిత్రకళా రంగంలో ఈ మధ్య మిమ్మల్ని ఆకట్టుకున్న
 విషయాలు ఏమిటి?
 అంతకుముందు ఏదన్నా చూడాలంటే మాలాంటి లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాళ్లందరూ అబిడ్స్(హైదరాబాద్)కి వెళ్ళి విదేశీ కళ మీద చవగ్గా దొరికే పుస్తకాలు ఏరి తెచ్చుకునేవారు. తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ వచ్చిన తర్వాత ఏం చూడాలన్నా సులభం. ఆర్టిస్టులు వాళ్ళ పనిని వెబ్‌సైట్‌లలోను, ఫేస్బుక్‌లోను పెడుతున్నారు. ఎప్పుడో వేసిన యుగాన్ షీలె బొమ్మలు చూడాలంటే వెంటనే ప్రత్యక్షం.
 
 మీ చుట్టూ నిరంతరం సాగే దర్బారు లాంటి వాతావరణంలో బొమ్మలు వేయటం ఇబ్బంది కాదా?
 ఎక్స్‌ట్రావర్టులు, ఇంట్రావర్టులు... ఇలా మనుషుల్లో ఎన్ని రకాలుంటారో ఆర్టిస్టుల్లోనూ అన్ని రకాలుంటారు. నేను పంతొమ్మిదేళ్ళు న్యూస్ పేపర్లలో పని చేశాను. కార్టూన్ గీసేటప్పుడు చుట్టూ సబెడిటర్లు, రిపోర్టర్లు ఉంటే నాకు కుదరదు అని అనలేము. అదొక ఇబ్బందిగా నేను ఫీల్ కాలేదు. నేను అలాగే పెరిగాను. చిన్నప్పుడు మా ఇల్లంతా పార్టీ ఆఫీసులా ఉండేది. జూట్ మిల్లు వర్కర్సూ, యూనియన్ పార్టీ నాయకులూ వస్తూండేవాళ్ళు, మా నాన్నతో చర్చలు నడిచేవి. విషయం ఏమిటంటే - అమెరికన్ కార్టూనిస్టు, రచయిత జేమ్స్ థర్బర్ అంటాడు: ‘‘నా వ్యాసంగంలో కష్టమైన అంశం ఏమిటంటే - కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తూ కూడా నేను పని చేస్తున్నానని మా ఆవిడని నమ్మించడం’’ అని. కూర్చుని చేసే పని కేవలం యాంత్రికమైనది. ఏం ఆలోచించావు, ఏం కన్సీవ్ చేశావు అన్నది ముఖ్యం.
 
 తమపై మీ ప్రభావం గురించి చాలామంది చిత్రకారులు చెప్తారు. బొమ్మలపై మీ అనురక్తిని వాళ్లకు ఎలా బదిలీ చేయగలిగారు?
 రాత్రి చదివిన పుస్తకం గురించో, లేదా ఆల్బమ్‌లో చూసిన బొమ్మల గురించో మరుసటి రోజు ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతాం. బడ్డీ కొట్టు దగ్గర కొత్త సినిమా హిట్టా ఫట్టా అని చర్చించుకోవడం లాంటిదే ఇదీనూ. మన ఆర్టిస్టుల్లో చాలామందికి చదివే అలవాటు ఉండదు. చిన్నపట్టణాల నుంచి వచ్చిన చాలామందికి ఇంగ్లీషుతో ఇబ్బంది ఉంటుంది. బొమ్మలు చూసి ముచ్చటపడిన పుస్తకాలు నా దగ్గరకు తీసుకువచ్చి ఆ బొమ్మల కింద ఇంగ్లీషులో ఏం రాశారో చెప్పమంటారు. అంతే నేను చేసింది.
 
 చిత్రకళ అనేక విభాగాల్లో పెయింటింగ్ వైపే మొగ్గు పెరిగి మిగిలినవి ఎందుకు వెనక పడుతున్నాయి?
 అరవై డెబ్భైల కాలంలో ఇండియాలో ఇంత సంపద లేదు. సంపన్న వర్గం అంటే టాటాలూ, బిర్లాలూ, జమీందార్లూ అనే. తర్వాత ఇక మధ్య తరగతి. ఈ రెంటి మధ్యలో ఇంటర్మిడియరీ క్లాసు ఒకటి లేదు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులైన లక్ష్మాగౌడ్, సూర్యప్రకాష్ లాంటి వాళ్ళు అప్పుడూ బొమ్మలు వేశారు గానీ వాళ్ళను పలకరించేవారే లేరు. అందుకని వాళ్ళు బరోడా, ఢిల్లీ లాంటి బయ్యర్లు ఉన్న చోట్లకి వెళ్ళి ప్రయత్నించేవారు.
 తర్వాత నెమ్మదిగా హైదరాబాదులో రిచ్ క్లాస్ పెరిగింది. జూబ్లీహిల్స్ చాలా మారింది. ఇంటీరియర్ డెకరేటర్లు వచ్చారు. వాళ్ళు తమ క్లయింట్లకి ‘ఈ గోడ మీద ఫలానా పెయింటింగు బాగుంటుంది’ అని చెప్తారు. అలా పెయింటింగ్‌కి డిమాండ్ పెరిగింది. ఇది మంచి అభివృద్ధే కానీ, నష్టం కూడా ఉంది. రియలెస్టేట్ బూమ్ ఉన్నప్పుడల్లా పెయింటింగ్స్ అమ్ముడవుతాయి. తగ్గితే కావు. గ్యాలరీల వాళ్ళను అడిగితే ‘‘ఏం కన్‌స్ట్రక్షన్లు కావటం లేదండీ’’ అంటారు. అదీ పరిస్థితి.
 
 పెయింటింగ్ వైపు ఎందుకు వెళ్ళలేదు?
 ఏవన్నా ఎసెన్మైంట్స్ ఉంటేనే నేను పెయింట్ చేసాను. కానీ బోరు కొట్టి బయటకు వచ్చాను. నాకు లైన్ డ్రాయింగ్ అంటే ఇష్టం, ఏనిమేషన్ మీద ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ళు దాని మీదే సమయం పెట్టుబడీ పెట్టాను. ఇప్పుడు నేను లక్ష్మా గౌడు లాగా, వైకుంఠం లాగా అవ్వాలీ అంటే నన్ను ఒక రెండు మూడేళ్ళు ఎవరన్నా పోషించాలి.
 
 కుంచెలు, తడిరంగులతో నిమిత్తం లేని డిజిటల్ ఆర్ట్ మీద మీ అభిప్రాయం?
 కుంచే ఎందుకు కావాలి, చీపురుపుల్లని నమిలి దానితో కూడా బొమ్మ వేయవచ్చు. అది కేవలం ఒక సాధనం. కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులు దాన్ని తిట్టారు. కానీ అది కూడా సాధనమే కదా. తెలుగులో ఫస్ట్ ఏనిమేషన్ నేనే చేశాను. అయినా ఇప్పటికీ కంప్యూటర్ ఆపరేట్ చేయలేను. లోపల ఏదో రెసిస్టెన్సు ఉంది. కానీ దాన్ని అసహ్యించుకోను. ఇంటర్నెట్‌లో గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి తెలుసుకోవచ్చు, లేదంటే ఫేస్బుక్‌లోకి పోయి ‘నేను ఇప్పుడే ఇడ్లీ తిన్నాను’ అని అప్డేట్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ సాధనాలంతే. సరుకంతా మన మైండ్‌లో ఉంటుంది.
 
 మీరు బొమ్మలు వేయటం ఒక ప్రివిలేజ్‌గా భావించిన రచన ఎవరిదైనా ఉందా?
 కె.ఎన్.వై. పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ ఇండియా టుడే’లో పబ్లిష్ అయింది. దానికి నేను వేసింది బెస్ట్ వర్క్.
 
 పెయింటింగ్ వైపు ఎందుకు వెళ్ళలేదు?
 ఏవన్నా ఎసెన్మైంట్స్ ఉంటేనే నేను పెయింట్ చేసాను. కానీ బోరు కొట్టి బయటకు వచ్చాను. నాకు లైన్ డ్రాయింగ్ అంటే ఇష్టం, ఏనిమేషన్ మీద ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ళు దాని మీదే సమయం పెట్టుబడీ పెట్టాను. ఇప్పుడు నేను లక్ష్మా గౌడు లాగా, వైకుంఠం లాగా అవ్వాలీ అంటే నన్ను ఒక రెండు మూడేళ్ళు ఎవరన్నా పోషించాలి.
 
 మరల మరల చదువుకునే పుస్తకాలు, రచయితలు?
 ఒకరని చెప్పలేను. తెలుగులో చలం, శ్రీశ్రీ, డచ్ చిత్రకారుడు రెంబ్రాంట్ జీవితం మీద ‘కాచ్ 22’ రచయిత జోసెఫ్ హెల్లర్ రాసిన ‘పిక్చర్ దిస్’ నవల చాలా ఇష్టం. అలాగే ఫ్రెంచ్ చిత్రకారుడు పాల్ గాగిన్- అతని అమ్మమ్మల మీద పెరూవియన్ రచయిత మారియో వెర్గాస్ ల్లోసా చరిత్ర మీద మంచి పరిశోధనతో, కళ మీద లోతైన అవగాహనతో రాసిన పుస్తకం ‘ద వే టు పారడైజ్’.
 ఇంటర్వ్యూ: ఫణి

మరిన్ని వార్తలు