రెక్క విప్పిన విత్తన విప్లవం

13 Jun, 2014 00:11 IST|Sakshi
రెక్క విప్పిన విత్తన విప్లవం

స్థానిక, సంప్రదాయక వరి రకాల విత్తనాలను ఏటేటా రైతులు ఇచ్చిపుచ్చుకునే ‘విత్తనాల పండుగ’ త్వరత్వరగా వ్యాప్తి చెందుతోంది. ‘మన వరిని కాపాడుకుందాం’ కార్యక్రమం ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన ‘కరికాలన్’ దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకుని నిలవడమే కాదు ఔషధ లక్షణాలను కలిగినది. దానికి సాటిరాగల అధిక దిగుబడి వరి ప్రపంచంలోనే లేదు.
 
నడి వేసవి మిట్ట మధ్యాహ్నం. 37 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ మంటెత్తు తోంది. అయినా అక్కడ చేరిన రైతుల్లోని ఉత్సాహం నీరుగారిపోలేదు. విత్తనాల పండుగ సంరంభంలో ఎవరికి వారే తమ ఉనికిని చాటాలన్నట్టుగా తోపులాట, పెనుగులాట. సంప్రదాయక వరి విత్తనాలను ఇచ్చి పుచ్చుకునే సంరంభంలో రైతుల కోలాహలం. తమిళనాడు తిరువాయూరు జిల్లా, రుత్తరైపొండి తాలుకా అతిరెంగం గ్రామంలో రెండు రోజులపాటు (మే 30-31) మకాం చేసిన వేలాది రైతులు తమ వాటా స్థానిక రకం వరి విత్తనాలను దక్కించుకుని గానీ అక్కడ నుంచి కదల దల్చుకోలేదు. అది ఎనిమిదేళ్లుగా ఏటా సాగుతున్న వరి విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పండుగ.
 2007లో కొందరు రైతులు తాము సంరక్షించిన 15 రకాల విత్తనాలతో ఈ వరి విత్తనం పండుగను ప్రారంభించారు. ఆ తదుపరి కేరళలోని ‘తనాల్,’ తమిళనాడులోని ‘సహజ సమృద్ధ’ సంస్థలు చేపట్టిన ‘మన వరిని కాపాడుకుందాం’ కార్య క్రమం దీన్ని నిర్వహిస్తున్నాయి. ఏటేటా రైతులు అత్యంతాసక్తిగా ఎదురు చూసే పండుగగా మారింది. గత ఏడాది 4,600 మంది రైతులు ఈ పండుగలో పాల్గొన్నారు. ఈ విజయంతో పలు స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘ బృందాలు తమిళనాడులో పలు చోట్ల ఏటా విత్తనాల మారకం పండుగను నిర్వహిస్తున్నాయి.

సజీవ వరి విత్తన భాండాగారం

వృక్ష, జంతు జాతులను వాటి సహజ పరిస్థితులలో సంరక్షించే పద్ధతిని  శా స్త్రవేత్తలు ‘ఇన్ సిట్యు సంరక్షణ’ అంటారు. దేశంలోని అతి పెద్ద ‘ఇన్ సిట్యు’ సజీవ వరి విత్తన భాండాగారం ఇదే. తమిళనాడుకు చెందిన 151, కేరళకు చెందిన 140 వరి రకాలను ఇప్పుడు రైతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారని ‘మన వరిని కాపాడుకుందాం’ కార్యకర్త ఆర్. శ్రీధర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంకర వరి వంగడాలను ఉధృతంగా ప్రోత్స హిస్తుండగా... సంప్రదాయ వరి విత్తనాల పండుగను జరపడాన్ని చూస్తే ఇది పెడదోబట్టిన ఉత్పత్తి పెంచే ప్రయత్నమనిపించవచ్చు. అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకూ. ఇటు హిమాచల్‌ప్రదేశ్ నుంచి కేరళ వరకూ సాగుతున్న నిశ్శబ్ద విప్లవాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. సంప్రదాయక విత్త నాల సంరక్షణకే కాదు, అంతరించిన రకాలను సాగుచేయడానికి కూడా రోజు రోజుకూ రైతులు ఎక్కువగా ముందుకు వస్తున్నారు.

 ఆర్కిటిక్ ప్రాంతంలోని స్వాల్‌బార్డ్ ‘గ్లోబల్ సీడ్ వాల్ట్’లో మన దేశం 1,000 వృక్ష జాతులను ‘ఎక్స్ సిట్యు’ పద్ధతిలో (వాటి సహజ పరిస్థితులకు దూరంగా) డిపాజిట్ చేయాలని చూస్తుండగా ఈ పండుగ జరగడం విశేషం. స్థానికమైన విత్తన జాతులను సంరక్షించడానికి అత్యుత్తమ మార్గం వాటిని సాగుచేయడం, సాటి రైతులతో పంచుకోవడమేనని ఇప్పుడు రైతులు చాటుతున్నారు.

వరి పండుగ పుట్టి, పెరిగిందిలా...  

2004లో నేను కేరళలోని కుంబాంగిలో మన వరిని కాపాడుకుందాం కార్య క్రమం ప్రారంభోపన్యాసం చేస్తూ... 2004 అంతర్జాతీయ వరి సంవత్సరం వెనుక ఉన్న రాజకీయాలను వివరించాను. ఆ ఆర్భాటమంతా వరి విత్తనాల నియంత్రణనంతటినీ బహుళ జాతి విత్తన బృహత్ సంస్థ ‘సింజెంటా’ చేతు ల్లో పెట్టడానికేనని తెలిపాను. వరి విత్తనాలపై బహుళజాతి సంస్థల గుత్తాధిప త్యం నెలకొల్పడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు విరు గుడు రైతుల విత్తనాలను తమలో తాము ఇచ్చుపుచ్చుకోవడమేనని సూచిం చాను. ఆ సూచనను ఆచరణలో పెట్టిన ఫలితమే నేటి విత్తనాల పండుగ. నేడు ‘‘కేరళ, తమిళనాడు, కర్ణాటకలేగాక ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెం గాల్, అరుణాచల్‌ప్రదేశ్‌లు కూడా మా కృషిలో పాలుపంచుకుంటున్నాయి’’ అని కేరళలోని విత్తనాల పండుగ ఆర్గనైజర్ ఆర్ పూనంబాలమ్ తెలిపారు.

స్థానిక రకాలను సాగుచేయాలని రైతులు చూపుతున్న ఆసక్తి పెంపొం దుతున్న తీరు అద్భుతం. 2007లో తమిళనాడులోని తంజావూరు వద్ద నిర్వ హించిన తొలి విత్తనాల పండుగకు రసాయనిక వ్యవసాయ వ్యతిరేక పోరాట యోధుడు, జీవావరణ నిపుణులు దివంగత జి.నమ్మళ్వార్ హాజరు కావడం మరచిపోలేనిది. నాడు రెండు వేల మందికి పైగా రైతులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, రాకపోకలు సహా అన్ని ఖర్చులను భరించి మరీ హాజరయ్యారు. రెండు రోజుల విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పండుగలో నిర్వహించిన పలు వర్క్‌షాపులకు హాజరయ్యారు.

 వచ్చే ఏడాది కనీసం నాలుగు కేజీలు తిరిగి ఇస్తామనే హామీతో ప్రతి రైతుకు రెండేసి కిలోల సంప్రదాయక వరి విత్తనా లను ఇచ్చారు. మొదటి బ్యాచ్ రైతులు తిరిగి వచ్చేటప్పుడు గత ఏడాది తాము పండించిన 10 కిలోల విత్తనాలను పట్టుకువచ్చారు. ఈ అలవాటే కొన్నేళ్లలోనే విత్తనాల మార్పిడి వృద్ధి చెందడానికి తోడ్పడింది. ‘ఈ ఏడాది 5,000 విత్తన మార్పిడులు జరుగుతాయని భావిస్తున్నామ’ని తమిళనాడు మన వరిని కాపాడుకుందాం కార్యక్రమానికి చెందిన జయరామన్ తెలిపారు.

ప్రకృతి వరాలు మాప్పిళై సాంబా... కుట్టాయం

‘‘రైతులు కొన్ని సాంప్రదాయక రకాలపై, ప్రత్యేకించి ఔషధ లక్షణాలున్న రకాలపై ఆసక్తిని కనబరచడంలో ఆశ్చర్యమేమీ లేదు. కొందరు బ్రౌన్ రైస్ రకాలపై, మరికొందరు సంప్రదాయక సుగంధ రకాలపై, ఇంకొందరు దుర్భిక్షాన్ని తట్టుకునే రకాలపై ఆసక్తిని చూపుతున్నారు. చాలా మందికి ‘మాప్పిళై సాంబా’ వరి రకంపై మక్కువ. ఔషధ లక్షణాలున్న అది కామోద్దీపనకు దోహదపడుతుంది’’ అని ఆయనచెప్పారు. మాప్పిళై అంటే తమిళంలో అల్లుడు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కుదిరితే పెళ్లి కొడుకు తరఫు వారికి ఈ బియ్యాన్ని ఇచ్చి పంపే రివాజుంది. 57 ఎకరాల్లో మాప్పిళై రకాన్ని పండిస్తున్న భాస్కరన్ ఆ బియ్యానికి ‘వయాగరా బియ్యం’ అని పేరు పెట్టారు.

ఈసారి వండుగకు వచ్చిన మరో అసాధారణ రైతు తిరుతిరాయ్‌పొండి గ్రామానికి చెందిన కరికాలన్. కుట్టాయం రకం వరి దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే రెండు లక్షణాలు గలదని కనిపెట్టాడు. ఆయన అనుకోకుండా పొరపాటున కుట్టాయం వరిని విత్తాడు. అనూహ్యంగా ఆ ప్రాంతం దుర్భిక్షానికి గురైంది. కరికాలన్ ఇరుగుపొరుగులందరి చేలల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా ఆయన కుట్టాయం పంట మాత్రం తట్టుకుని నిలిచింది. అప్పటి నుంచి ఆయన ఆ రకాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. వాతావరణంలోని పెనుమార్పులను తట్టుకుని నిలిచే కుట్టాయం రకానికి ఔషధ గుణాలుకూడా ఉన్నాయి. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే కిలో కుట్టాయం వరి విత్తనాలకు అత్యధికంగా రూ.100 ధర లభిస్తోందని కరికాలన్ తెలిపారు.

 కుట్టాయం ప్రకృతి అద్భుత సృష్టి. దానిలా దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే అధిక దిగుబడి రకాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఈ రకానికి ఉన్న విశిష్ట లక్షణాలను గుర్తించగలిగిన కరికాలన్ శక్తి సామర్థ్యాలకు ఆయన సంప్రదాయక స్థానిక వరి విజ్ఞాన సంరక్షకుడయ్యాడు. ఆయన చేసిన పనే ఏ వ్యవసాయ శాస్త్రవేత్తో చేసి ఉంటే ప్రపంచ ఆహార బహుమతి లభించి ఉండేది.
 జయరామన్‌ను ఇప్పుడు అంతా నెల్లు జయరామన్ అని పిలుస్తుం టారు. తమిళంలో నెల్లు అంటే వరి. ఆయన చేసిన విశిష్టమైన ఆసాధారణ కృషికి ప్రజలు ఆయనుకు ఇచ్చిన పురస్కారమది.ఇకపై వరిపై విశేష కృషి చేసిన ఒక్కొక్క రైతుకు ఈ నెల్లు బిరుదు ప్రదానం చేయాలని నిర్వాహకులకు విజ్ఞప్తి. తద్వారా వరిని కాపాడుకుందాం కార్యక్రమం వేగం పుంజుకుం టుంది. ఈఏడాది కూడా నెల్లు గౌరవ పురస్కారాన్ని అందుకోనున్న రైతు పేరును వారు ప్రకటించారు.

 (వ్యాసకర్త వ్యవసాయ విజ్ఞాన నిపుణులు)  దేవిందర్ శర్మ
 

 

మరిన్ని వార్తలు