తీసికట్టు నాగంభొట్ల కప్పదాట్లు

19 Jun, 2014 00:15 IST|Sakshi
తీసికట్టు నాగంభొట్ల కప్పదాట్లు

భారత రాజకీయాలు చిత్రమైనవి. స్వాతంత్య్రోద్యమాన్ని నడిపిన ఆనాటి కాంగ్రెస్‌కు, సోనియా నాయకత్వంలోని ఇప్పటి పార్టీకి సంబంధం లేదు. అయినా  ప్రజలు పదేళ్ల పాటు  ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ఆ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? రాదా? అనేది ఇప్పుడు అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోడీ చేసే లోటుపాట్లపై ఆధారపడి ఉంటుంది. మరి, కేంద్రంలో ఎన్నడూ అధికార ఛాయలకే రాని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సీపీఎం పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ప్రస్తుత ప్రశ్న. చట్టసభల్లో సంఖ్యే ప్రామాణికం కానప్పటికీ కమ్యూనిస్టు పార్టీల పునాదులు కదిలిపోతున్న తీరుకు 2014 ఎన్నికలు అద్దం పట్టాయి.

2004 సార్వత్రిక ఎన్నికల్లో 44 సీట్లను గెలిచిన సీపీఎం 2009లో 16 సీట్లకు, 2014 ఎన్నికల్లో 9కి పరిమితమైది. సీపీఐ పరిస్థితి మరింత ఘోరం. 29 రాష్ట్రాల్లో ఒకే ఒక సీటును గెలిచింది. తాత్కాలిక ఆగ్రహావేశాలు, ఆకోశ్రాలు చల్లారిన తర్వాత సీపీఎం పూర్తిస్థాయి సమీక్షకు దిగింది. ముందు బెంగాల్, ఆ తర్వాత మొత్తం దేశంలో పార్టీ పరిస్థితిని సమీక్షించింది. 15 మంది హేమాహేమీలున్న పొలిట్‌బ్యూరో, 89 మంది ఉన్న కేంద్ర కమిటీ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను నెత్తినేసుకుంది. సమష్టి బాధ్యతనే పాత వాదనకు ఇది భిన్నం. ఈలోపు కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు రాజీనామాకు ముందుకొచ్చినా అది సమస్యకు పరిష్కారం కాదని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సర్దిచెప్పి వచ్చే మహాసభల వరకు వాయిదా వేయించారు. అయితే ఓటమికి చెప్పిన కారణాలు మాత్రం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే ఉన్నాయి.

 మోడీ హవాను పసిగట్టలేకపోయామని చెప్పడం ఏ మాత్రం సహేతుకంగా లేదు. రాజకీయాల్లో తలపండిన వీరికి ఇంత చిన్న విషయం అర్థం కాకుండా పోతుందని ఎవ్వరూ అనుకోరు. ఇక, రెండోది.. విధానాలు, పోరాటాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయం. ఈ ప్రతిపాదన వచ్చినప్పుడే ఇదేదో బ్రహ్మపదార్థంలా ఉందన్న విమర్శలొచ్చాయి. ఉంటే మూడో ప్రత్యామ్నాయం లేకుంటే వామపక్ష సంఘటన ఉండాలి గాని ఇదేమిటని అడిగినా  ఫలితం లేకపోయింది. వాస్తవానికి ఈ ప్రయత్నానికీ ఆదిలోనే గండి పడింది. కనీసం అప్పుడన్నా పునరాలోచన చేసి ఉండాల్సింది. మూడో కారణం నియో లిబరలిజం. ఇది ఈవేళ్టిది కాదు.. వచ్చి 22 ఏళ్లు దాటింది. ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయాల్సిన పని లేకపోయినా భారతీయ మనోభావాల్ని గుర్తించడంలో, అందుకు తగ్గ విధానాన్ని ఎంపిక చేయడంలో కమ్యూనిస్టులు మరోసారి విఫలమ య్యారన్నది కారత్ మాటల్లోనే స్పష్టమైంది. ఈ విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఐదేళ్లుగా మేము చేస్తున్న చర్చ ఇంకా ఓ కొలిక్కి రాలేదని, పార్టీతో సంబంధం లేని మార్క్సిస్టు నిపుణుల సలహాలతో  త్వరలో సమగ్ర కార్యాచరణకు దిగుతామన్నారు.
 సోవియెట్ యూనియన్ కుప్పకూలినప్పుడు, బెంగాల్ లో పార్టీ ఓటమి పాలయినప్పుడు, లాటిన్ అమెరికన్ దేశాల్లో పెల్లుబికిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు పక్కదారి పట్టిన ప్పుడు చర్చోపచర్చలు, విధాన పత్రాలూ తయారుచేశారు. ఫలితమేంటన్నదే ప్రశ్న. ప్రస్తుత ఓటమి తర్వాత  నయా ఉదారవాదం మొదలు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగు ణంగా ఎలా నడచుకోవాలో చర్చిస్తామంటున్నారు..

అంటే ఇంత కాలం ఆ పని చేయలేదా? అని సాదాసీదా కార్యకర్త అడిగితే సమాధానం ఏమిటి? తమకు ఓటేయని జనానికి బదులు చెప్పాల్సిన పనేముందని ఎదురుదాడికి దిగితే చేసేదేమీ లేదు కానీ, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నిపుణుల సల హాలు తీసుకోబోతున్నామనేది మాత్రం కచ్చితంగా సమా ధానం కాదు. సోనియా, నితీష్ కుమార్ వంటి బూర్జువా పార్టీ నేతలు, వాళ్ల నాయకత్వాలు ఓటమికి బాధ్యత వహిస్తా యేమో గానీ మా విధానం అది కాదు. మాకు సమష్టి నాయకత్వంలో విశ్వాసం ఉందంటున్నారు పశ్చిమ బెంగాల్ కార్యదర్శి బిమన్ బోస్. మరి అట్లాంటప్పుడు సమష్టి నాయ కత్వానికి బదులు పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ మాత్రమే ఈసారి బాధ్యత మొత్తాన్ని నెత్తికెత్తుకుందెందుకు? సమష్టి పని విధానం, వ్యక్తిగత బాధ్యతన్నది కమ్యూనిస్టుల విధా నం. ఈ సూత్రం ప్రకారం- బూర్జువా నేతల్ని అడిగినట్టే కమ్యూనిస్టు కార్యకర్తలు తమ నాయకుల్ని నిలదీస్తే జవాబు ఏమిటి? సమస్య ముదిరిపోయినా పరిష్కారం మాత్రం నిర్దిష్ట గడువు ప్రకారమేనని చెబుతారా? దానికి కాలమే జవాబు చెప్పాలి మరి..!

 - ఎ. అమరయ్య
 
 

మరిన్ని వార్తలు