‘తక్షణమే త ప్పుకోండి’ | Sakshi
Sakshi News home page

‘తక్షణమే త ప్పుకోండి’

Published Wed, Jun 18 2014 11:00 PM

‘తక్షణమే త ప్పుకోండి’ - Sakshi

న్యూఢిల్లీ: రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి నిహల్‌చందర్ మేఘ్వాల్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం డిమాండ్ చేసింది. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం భారీ ఆందోళన నిర్వహించింది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో అశోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శోభా ఓఝా నేతృత్వంలోని బృందం బీజేపీకి వ్యతిరేకంగా నినదించింది. మేఘ్వాల్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శోభా ఓఝా మీడియాతో మాట్లాడుతూ ‘ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
 
 ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలు వెలుగులోకి రాగానే రాష్ట్రపతి విధించాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఇవే ఘటనలు చోటుచేసుకుంటే మిన్నకుండిపోయారు’ అని ఆరోపించారు. ఒకవేళ అత్యాచారాలు సహజమని బీజేపీ భావిస్తే ఇక మహిళలకు వారు ఎటువంటి భద్రత కల్పించగలుగుతారు. మహిళలపై నేరాలను సహిం చబోమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. జీరో టాలరెన్స్ అంటే ఇదేనా అని ఆయనను అడగదలుచుకున్నాం. అత్యాచార బాధితురాలికి భద్రత కల్పించాలి. కేసు వెనక్కి తీసుకోవాలంటూ తనపై ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలిని బెదిరించేందుకు మేఘ్వాల్ తన అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని మేము ఎంతమాత్రం భావించడం లేదు’ అని అన్నారు. కాగా ఆందోళనకారులు బీజేపీ కార్యాలయం వద్ద ఉంచిన బారికేడ్లను దాటి ముందకెళ్లేందుకు యత్నించారు. అంతటితో ఆగకుండా మంత్రి మేఘ్వాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Advertisement
Advertisement