గ్రీష్మభూమి: వేంపల్లి గంగాధర్ కథలు...

22 Mar, 2014 03:44 IST|Sakshi
గ్రీష్మభూమి: వేంపల్లి గంగాధర్ కథలు...

వేంపల్లి గంగాధర్ కథలు ముక్కుసూటిగా ఉంటాయి. కథ ప్రారంభమయ్యి ముగిసే వరకూ ఎక్కడా దారి తప్పవు. పాత్రలు నేరుగా సరళంగా ఉంటాయి. కథనంలో అనవసర, అదనపు అంశాలు ఉండవు. భిన్నమైన శిల్ప, భాషాధోరణులు కూడా కనిపించవు. నేరుగా తినాల్సిన బ్రెడ్ ముక్కల్లాంటివి ఇవి. పాలు, తేనె, జామ్ జత చేయడం, శాండ్‌విచ్ చేయడం, డబుల్ కా మీఠా... ఇవన్నీ మర్మంలోకి వెళ్లాలనుకున్న రచయితలు చేసే పని. కాని గంగాధర్ తన కథలతో పాటు పాఠకులతో కూడా ముక్కుసూటి సంబంధం పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన కథలకు పేరు రావడమే కాదు కేంద్ర సాహిత్య అకాడెమీ ‘యువ పురస్కారం’ కూడా వరించింది. దిగువ వర్గాల ప్రజల మీద గంగాధర్ తన దృష్టి ఉంచుతారు. ఒక పాత్ర తారసపడితే దానితో కాసేపు సంభాషించి, పరికించి కథ పుట్టించడం (ఎడారి ఓడ, ఆగ్రా టాంగా, జముడు పువ్వు, కొయ్య కాళ్ల మనిషి...) గంగాధర్ కలం విశేషం.  ఒక తావు పేరు దొరికినా దాని ఆధారంగా ఆ తావు చుట్టూ కథను కల్పించి రాయడంలో (తూర్పు మండపం, దేవళం చెరువు) గంగా ధర్‌కు ప్రీతి ఉంది. 


‘గ్రీష్మభూమి’లో అలాంటి కథలు 13  ఉన్నాయి. ఒక జీవన శకలాన్ని చూపించి చిన్న నీతి బయల్పడేలా చేయడం, అంతరించిపోయే వృత్తి/చేతి కళాకారుల బతుకు చిత్రాలను న్యూస్ స్టోరీలా అనిపించకుండా రాయగలగడం వీటి ప్రత్యేకత. గంగాధర్‌కు బహుశా వానంటే ఇష్టం. ఆయన కథ మొదలుపెట్టాలంటే ఎక్కడో ఒక చోట నుంచి మోడాలు (మేఘాలు) కమ్ముకు రావాలి. లేదా కథ మధ్యలో వాన కురిసి వాతావరణాన్ని బరువెక్కించాలి. ఆయన కథల సక్సెస్ వెనుక వాన కూడా ఉంది. వారపత్రికలు అనుమత నిడివిలో ఉంటూనే, పాఠకులు అనుమతించే అంశాలకు పరిమితమవుతూనే, అందరూ  అనుమతించే పద్ధతిలో రాస్తూనే తనదైన ముద్ర వేసి తెలుగు రచయితల్లో ముందు వరుసలో నిలవడం సామాన్యమైన విషయం కాదు. ఇది గంగాధర్ విజయం. గ్రీష్మ భూమి సంపుటిలోని కథలు ఆ ధోరణిని స్థిరం చేయడమే కాదు ఆయన స్థానాన్ని సుస్థిరపరుస్తున్నాయి. రెండు వేల మందికీ మూడు వేల మందికీ చిటికెలో వండి వార్చేవాడిని వంటవాడు అంటారు. కాని ఇంట్లో ఒక కూర, చారు కాచుకోవడంలో ఉండే  తృప్తిని ఆస్వాదించాలంటే వేంపల్లి గంగాధర్ కథలు తప్పక చదవాలి.
 - లక్ష్మి మందల
 గ్రీష్మభూమి- వేంపల్లి గంగాధర్ కథలు; వెల: రూ.65; విశాలాంధ్ర ప్రచురణ;
 ప్రతులకు: విశాలాంధ్ర

 

మరిన్ని వార్తలు