జననీరాజనం

22 Mar, 2014 00:44 IST|Sakshi
శుక్రవారం రాత్రి వినుకొండ శివయ్యస్థూపం వద్ద నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం, మాట్లాడుతున్న షర్మిల.

సాక్షి, గుంటూరు మహానేత రాజన్న తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు శుక్రవారం రాత్రి వినుకొండ ప్రజానీకం నీరాజనం పట్టింది. రాజన్న ముద్దుబిడ్డను చూసి జనవాహిని ము రిసిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ శివారు శివాపురం గ్రామం వద్దకు రాగానే షర్మిలకు ఎదురెళ్లిన అభిమాన  జనం ఆత్మీయస్వాగతం పలికారు.
 
  తొలుత షర్మిలకు నరసరావుపేట లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఘనస్వాగతం పలికారు.  షర్మిల రాక సందర్భంగా వినుకొండ పట్టణం జనసంద్రంగా మారింది. జనవాహిని మధ్య నుంచి షర్మిల బస్సు బహిరంగ సభ ఏర్పాటు చేసిన శివయ్య స్థూపం వద్దకు చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది.
 ఈ సందర్భంగా షర్మిలకు స్వాగతం పలికేందుకు మహిళలు పోటీ పడ్డారు. పూల వర్షం కురిపించారు. అనుకున్న సమయానికంటే  మూడు గంటలు ఆలస్యమైనా షర్మిల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. షర్మిల బస్సు  శివయ్య స్థూపం వద్దకు చేరుకోగానే  ఈలలు, చప్పట్లు, జోహార్ వైఎస్సార్ ,జై జగన్ అంటూ అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
 
  షర్మిల ప్రసంగం అర్ధగంట సేపు సాగింది. ఆమె ప్రసంగం అయ్యేంతవరకు కార్యకర్తలు, అభిమానులు అక్కడి నుంచి అడుగు పక్కకు వేయకుండా  కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలపునివ్వడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రసంగం ముగిసిన తరువాత షర్మిల బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వినుకొండ శివారు విఠంరాజుపల్లిలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు.
 
  షర్మిల రాకముందు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. అంతకముందు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ మాట్లాడుతూ షర్మిలకు ఘనస్వాగతం పలికిన వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల పేరిరెడ్డి వినుకొండ మాజీ ఎంపీపీ చీరపురెడ్డి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 సంక్షేమం.. అభివృద్ధి జగన్‌కే సాధ్యం
 ఆళ్ల అయోధ్యరామిరెడ్డి

 సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు తిరిగి కొనసాగాలంటే అవి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని నరసరావుపేట లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం వద్ద జరిగిన షర్మిల బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
 మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించి వినుకొండ దెబ్బ ఏమిటో చూపించాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలనీ, జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించకూడదన్నారు. మహానేత వైఎస్ అంటేనే మనకొక అండ ఉందనే భరోసా రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఉండేదని గుర్తు చేశారు. ఆయన లేనప్పటికీ మనందరికీ ఇద్దరు వీరులైన బిడ్డలను అప్పగించారని, వారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని  చెప్పారు.  రాజన్న రుణం తీర్చుకోవాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
 
  పోస్టుగ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్ నన్నపనేని సుధను వినుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గాలికి అన్ని పార్టీలు ఎగిరిపోతాయన్నారు. తనతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వినుకొండ నుంచి మంచి టీంను పోటీలోకి దించామని, వారందరినీ గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు