హిందీ-తెలుగు వంతెన

27 Sep, 2015 01:14 IST|Sakshi
హిందీ-తెలుగు వంతెన

- డాక్టర్ వై.బాలశౌరిరెడ్డి
 1 జూలై 1928 - 15 సెప్టెంబర్ 2015
 ‘‘బాల’ శబ్దం పేరులోనేగానీ, బాలశౌరిరెడ్డి గారు నిజానికి ‘ప్రౌఢ’ రచయిత. హిందీ తెలుగు భాషల మధ్య వారధి బంధించిన మహావ్యక్తి. ఉభయభాషల్లో వారికున్న పాండిత్యం వల్ల ‘రామాయణ కాలంలో భారతీ సంస్కృతి’(హిందీ మూలం: డాక్టర్ ఎస్.ఎస్.వ్యాస్) అనువాదం సాధ్యపడింది. తెలుగువారిని హిందీవారికి పరిచయం చేసిన చాలాకొద్దిమందిలో బాలశౌరిరెడ్డి గారొకరు. వారిని ఉత్తర భారతదేశంలో ఎంతో గౌరవించారు’’ అన్నారు దాశరథి.
 
 నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ని 1969లో బాలశౌరి హిందీ పాఠకులకు పరిచయం చేశారు. 1971లో కందుకూరి వీరేశలింగం పంతులు ‘రాజశేఖర చరిత్రము’ను అనువదించారు. తర్వాతి యేడు రావిశాస్త్రి ‘అల్పజీవి’ని హిందీ చేశారు. 1954లోనే తిక్కన, పోతన, పెద్దన, వేమన, చేమకూర వేంకటకవుల పద్యాల్ని హిందీలోకి మోసుకెళ్లారు. ఆంధ్ర హిందీ పరిషత్తు, హైదరాబాద్ వారు ఆ 625 పద్యాలనూ ‘పంచామృత్’ పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని చదివి అప్పటి గవర్నర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య బాలశౌరికి అభినందన లేఖ పంపారు.
 
 పులివెందులలోని మారుమూల పల్లెటూరు గొల్లల గూడూరులో జన్మించారు బాలశౌరిరెడ్డి. 1946లో మద్రాసు హిందీ ప్రచార సభలో గాంధీజీని కలిశారు; హిందీలో ఆయన ‘ఆటోగ్రాఫ్’ తీసుకున్నారు. ‘ఆ సంతకం నాలో ఆసక్తిని, హిందీభాష పట్ల అభిలాషను తీవ్రంగా పెంచిం’దని తరచూ చెప్పేవారు. అన్నట్టుగానే హిందీలో 75, తెలుగులో 13 రచనలు చేశారు. తెలుగులోంచి దాదాపు 235 కథల్ని, 5 సంపుటాలుగా హిందీలోకి మోసుకుపోయి ‘తెలుగు కథ’ ఉనికికి ఊపిరి పోసిన ఘనత బాలశౌరికి దక్కుతుంది. నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు 30 మంది సాహిత్యకారుల ‘తెలుగు వాఙ్మయ చరిత్ర’ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత ప్రచురించిన ఘనత కూడా!
 1966-1988 వరకు రెండు దశాబ్దాల కాలం హిందీ ‘చందమామ’కు సంపాదకుడుగా పనిచేశారు.
 
  వీరి ఆలోచనా విధానం, ఎంపిక శైలి వంటి కారణాల వల్ల పత్రిక సర్క్యులేషన్ 75 వేలను దాటి 1,67,000కు చేరుకోగలిగింది. భారతీయ భాషా పరిషత్తు డెరైక్టరుగానూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల హిందీ అకాడమీల అధ్యక్షుడుగానూ పనిచేశారు. 65 ఏళ్లు మద్రాసులోనే ప్రవాసజీవితం గడిపిన బాలశౌరిరెడ్డి ‘నేను ఇంట ఓడి, రచ్చ గెలిచాను’ అని ఆవేదన చెందేవారు. ‘కడప నేల మట్టిలో సాహిత్య శక్తి వుంది’ అని గర్వంగా చెప్పేవారు. కడపోత్సవాల సందర్భంగా వారికి ఘనసత్కారం జరిగింది. వారి ‘జ్ఞాపకాలు’ నేను సావనీరులో రాశాను. ఆ అక్షరాల్ని చూస్కొని కళ్లనిండా ఆత్మీయతను వర్షించారు. వారిప్పుడు లేరు. వారి రచనలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.
 ఠి డాక్టర్ వేంపల్లి గంగాధర్
 9440074893

మరిన్ని వార్తలు