ఇందిర జాడలో మోదీ నీడ

23 Jun, 2015 01:22 IST|Sakshi
ఇందిర జాడలో మోదీ నీడ

ప్రధాని ఇందిర లోక్‌సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటించిన ట్టుగా) సంగతి వాస్తవం. అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా?  
 
 దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే శక్తులు బలంగా ఉన్నాయి. మళ్లీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంటు, ఇతర రాజ్యాంగ వ్యవస్థల హక్కులను హరించే ప్రమాదం ఉంది. రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన రక్షణ వ్యవస్థలను కూడా లెక్క చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అణగదొక్కే శక్తులు ఇప్పుడూ ఉన్నాయి. గత ఎమర్జెన్సీ కాలం (1975-77) తరువాత పౌర హక్కులకు మళ్లీ గ్రహణం పట్టించడానికో లేదా నాశనం చేయడానికో ప్రయత్నించబోమన్న భరోసా ఇచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరిగినట్టు దాఖలా లేదు. ప్రజల ప్రాథమిక సత్వాలను అణచ డం అంత తేలిక కాదు, కానీ మళ్లీ అలాంటి రోజులు రావని మాత్రం నేను చెప్పలేను.
 
ఎల్.కె. అద్వానీ (బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని, 19-6-2015)

 జూన్ 25, 1975-పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన సప్త స్వాతంత్య్రాలనూ, పౌర హక్కులనూ కాలరాసి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని అంధ కారంలోకి నెట్టిన దుర్దినం. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి అర్ధంత రంగా ఆమె ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన రోజు. ప్రజాస్వామ్య వాదులనూ, పౌర హక్కుల నేతలనూ, విపక్ష నాయకులనూ వేల సంఖ్యలో అరెస్ట్ చేసి జైళ్లకు పంపిన రోజు అదే. దాదాపు 22 మాసాలు సాగిన ఈ ‘పంబల దొరతనం’లో బీట్ కానిస్టేబుళ్లే పత్రికా స్వేచ్ఛను శాసించే సెన్సార్ అధికారులయ్యారు. అలాంటి దుర్దినాలను అద్వానీ, ఆయనతో పాటు ఆయన పార్టీ (అప్పుడు భారతీయ జనసంఘ్) ఇతర నేతలూ చవిచూశారు. ఆ రోజులను తలుచుకుంటూ, ప్రస్తుత ప్రధానీ తన పార్టీకే చెందిన నరేంద్ర మోదీ పాలనకు కూడా వర్తించే విధంగా అద్వానీ ఎమర్జెన్సీ నలభై ఏళ్ల సందర్భంగా ఎందుకు అలా వ్యాఖ్యానించవలసి వచ్చింది?
 
అద్వానీ వ్యాఖ్యల వెనుక మతలబు?

 ప్రధాని పదవికి అర్హత ఉన్నప్పటికీ బీజేపీలోని మోదీ-అమిత్‌షా వర్గం; భారత ఐక్యతను చెదరగొట్టడానికి ‘హిందుత్వ’ చాటున శాసిస్తున్న ఆరెస్సెస్ పరివార్‌లు తనను తప్పించినందుకే అద్వానీ ఇలా ఎదురుదాడికి దిగారా? గుజరాత్‌లో మైనారిటీల మీద జరిగిన మారణకాండకు కారకులైన శక్తుల మీద సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించవలసి ఉంది. కానీ అందుకు కారకులైన కొన్ని శక్తులు ఇప్పుడు దేశ పాలనాధికారాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జెన్సీ రాగల ప్రమాదాన్ని గుర్తించి అద్వానీ ముం దస్తు హెచ్చరికలు చేయవలసి వచ్చిందా? ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనడానికి అద్వానీ ఊహిస్తున్న, దర్శిస్తున్న కారణాలను ప్రజలు తెలుసుకోవలసి ఉంటుంది.
 
 కేంద్రంలో బీజేపీ-ఎన్‌డీఏ అధికారం చేపట్టినది మొదలు ఈ ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఎన్నికల ప్రణాళికలో వారు చేసిన వాగ్దానాలకు గానీ, ఇచ్చిన భరోసాలకు గానీ పూర్తి విరుద్ధంగానే ఉన్నాయి. ప్రభుత్వ చర్యలన్నీ విరుద్ధ పంథాలోనే సాగుతున్నాయి. దీనికితోడు భార తీయ సమాజాన్ని చీలికల బాట పట్టించే మార్గాలను ప్రభుత్వం అన్వే షిస్తున్నది. ఆర్థిక విధానాల విషయంలో ప్రజాస్వామ్య, సైద్ధాంతిక దృక్పధం, విలువలూ లేకపోవడంతో కేంద్రం పెడమార్గాలు తొక్కుతోంది. మళ్లీ వాటిని సమర్థించుకోవడానికి నిరంకుశ ధోరణులను ఆశ్రయిస్తూ, అలాంటి ధోరణు లకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆసరా ఇస్తున్నారు. అందువల్లనే రానున్న పరిణామాలను ఊహించి పార్టీ కార్యకర్తలనూ, దేశ ప్రజలనూ అద్వానీ అప్ర మత్తం చేయదలిచారా? దేశ ఆర్థికవ్యవస్థ దిశనూ, విదేశాంగ విధానం దిశనూ సర్వతంత్ర, స్వతంత్రంగా తీర్చిదిద్దడంలో, కాంగ్రెస్-యూపీఏ పాలనకు భిన్నంగా నిర్వహించడంలో బీజేపీ విఫలమైంది. అవే విదేశీ బడా గుత్త వర్గాలకూ, దేశీయ సంపన్న వర్గాలకూ జోహుకుం అంటున్న తీరులో కేంద్రం నడుస్తున్నందుకే అద్వానీ అలాంటి హెచ్చరిక చేశారా?
 
ఒక రంగమని కాదు; న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో, పౌర హక్కులను గౌరవిం చడంలో, పారిశ్రామిక కార్మిక చట్టాలను, వ్యవసాయ కార్మికుల ప్రయోజనా లను కాపాడే చట్టాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరికి పాల్పడుతున్నది. దీనితో ఉత్పన్నమయ్యే అశాంతిని పరిష్కరించే దారి లేక, ప్రభుత్వం నిర్బంధాలకు పచ్చజెండా ఊపక తప్పదని అద్వానీ భావించి, ఎమర్జెన్సీ ప్రమాదం గురించిన ప్రకటన చేశారా?
 
న్యాయ వ్యవస్థతో పేచీతోనే...

గత ఎమర్జెన్సీకి కారణం- అలహాబాద్ హైకోర్టు తీర్పు. ప్రధాని ఇందిర లోక్ సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటిం చినట్టుగా) సంగతి వాస్తవం.
 
 అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా? ఇదికాకపోతే, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీ ప్రభృతుల మీద సమర్థించుకోలేని ఆరోపణలు ముమ్మరించడంతో బీజేపీ అగ్రనేత నోటి నుంచి ఈ ప్రమాద హెచ్చరిక వెలు వడిందా? లలిత్ మోదీ వ్యవహారంలో ప్రధాని సహా కీలక వ్యక్తులు ఆరోప ణలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, గత ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను క్రమంగా ఎలా భ్రష్టు పట్టించిందో గుర్తు చేయడానికే. తనకు లొంగిరాని న్యాయమూర్తుల స్వేచ్ఛకు ఎలా సంకెళ్లు వేసిందో, అనుకూలురు-ప్రతి కూలురు అన్న అధర్మ త్రాసులో ఉంచి న్యాయమూర్తుల పదోన్నతులను శాసించి న్యాయ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడానికి నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నించిందో అందరికీ తెలుసు.
 
 మెజారిటీ జ్యూడీషియరీని తనకు అనుకూల వ్యవస్థగా మార్చుకోవడానికి నాటి ప్రభుత్వం అనుసరిం చని మార్గమంటూలేదు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులను అణగదొక్కి, కిందిస్థాయిలో ఉన్న న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించిన దుర్ముహూ ర్తాలు అప్పుడే కనిపిస్తాయి. అప్పుడు హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం పాల కులు నిర్వీర్యం చేశారు. అయితే సుప్రీంకోర్టులో తన పదోన్నతిని కూడా గడ్డి పోచలా భావించి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా వేయి మంది డిటెన్యూలకు ఒక్క కలం పోటుతో స్వేచ్ఛ కల్పించారు. బెయిల్ సౌకర్యం కల్పించారు. కానీ ఖన్నాకు అమెరికాలో స్తూపం నిర్మించారు గానీ, ఇక్కడ అలాంటి సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
 
 ఇప్పుడు కూడా మంచీచెడులతో నిమిత్తం లేకుండా పాత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం తన వంతు పని మొదలు పెట్టింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) వంటి సంస్థలకు, కేంద్ర సర్వీసులకు నియమించే అధిపతుల విషయంలో యోగ్యతలకన్నా, ఇతరత్రా కారణాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. యూపీఏ బాటలోనే కేంద్ర గూఢ చారి, నిఘా సంస్థలను రాజకీయ కక్షలు సాధించుకోవడానికీ, స్వప్రయోజ నాలకు దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన తరువాతనే పార్టీలో సీనియర్ నేతగా, మాజీ పాలకునిగా అద్వానీ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధించే అవకాశాల గురించి హెచ్చరించి ఉండాలి!
 
 దేశంలో తాజాగా ముంచుకొస్తున్న, ముదురుతున్న సమస్య ఒకటి ఉంది. ఇంతకు ముందు న్యాయమూర్తుల నియామకం కోసం స్వతంత్రంగా వ్యవహరించే సంఘాన్ని (కొలీజియం) తొలగించి కేంద్రమే ఆ బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. రాజకీయ పాలనా వ్యవస్థ ఏలుబడిలో ఉండే విధంగా జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామక సంఘం ఏర్పాటు చేయడానికి వీలుగా మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ విషయంలో ఇరు వైపులా కూడా తప్పొప్పులకు అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ పద్ధతి వల్ల న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు వెలువరించలేని దుర్దశకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి.

జస్టిస్ ఖన్నా, ప్రొఫెసర్ జైన్‌లు ఒక సం దర్భంగా పేర్కొన్నట్టు, ‘దేశాన్ని పాలించవలసింది చట్టానికి బద్ధమై ఉండే ప్రభుత్వమే కానీ, అధికారంలో కూర్చునే వ్యక్తులు కాదని గుర్తుంచుకోవాలి. సవరణల ముసుగులో వ్యవహారాలు నడిపే పార్లమెంట్ కూడా ఇందుకు సమర్థురాలు కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నిరంకుశ వ్యవస్థలుగా మార్చడానికీ, లోక్‌సభ, రాజ్యసభలను వంశపారంపర్య సభ్యసంస్థలుగా మార్చగల లేదా, వాటిని రద్దు చేయగల శక్తి కూడా పార్లమెంట్‌కు లేదు.’

 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్,  సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు