కార్పొరేట్లకే ‘మంచిరోజులు’

2 Jul, 2016 02:15 IST|Sakshi
కార్పొరేట్లకే ‘మంచిరోజులు’

సందర్భం
మీరు వాగ్దానం చేసిన ‘అచ్చేదిన్’ కోటీశ్వరులకు, సంఘ్‌పరివార్‌కు తప్ప సాధారణ ప్రజలకు ‘‘బూరా దిన్’’ (చెడ్డరోజులు) మాత్రమేనని భావిస్తున్నాం. వామపక్షాలు కాంగ్రెస్ వారి ఆర్థిక విధానాలపైనా, అవినీతిపైనా నిరంతరం ఎండగట్టి, పోరాటం చేస్తున్నాయి. అలాగే బీజేపీనీ విమర్శిస్తున్నాయి.
 
కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రా యాలు తెలియనివి కావు. కాంగ్రెస్‌తో పాటు, వామపక్షాలపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీడియాలో ఆయన వెలువరించిన వ్యాసం అందులో భాగమే. ఇదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. అలాగే ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజ మైపోదు.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వామపక్షాలు అస హనంతో రగిలిపోతున్నాయని వెంకయ్యనాయుడి ఆరోపణ. అసహనం ప్రతిపక్షాలది కాదు. సంఘపరివార్ అనుయాయులదే. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారేను, ప్రొఫెసర్ కల్బుర్గీని హత్య చేశారు. అంతకు ముందే నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేశారు. ఈ హత్యలు చేసింది ఒక ‘సనాతన సంస్థ’. గోవా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సతీమణులు ఇందులో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వారిపై నమోదైన కేసులను విచారణ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారు.

రచయితలు ఏం రచించాలో, ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలలో ఏం బోధించాలో, విద్యార్థి సంఘాలు ఎలాంటి నినాదాలు ఇవ్వాలో శాసించి, దానిని అంగీకరించని వారిపైన దేశద్రోహం కేసు పెట్టారు. విద్యార్థి నాయకులని విశ్వవిద్యాలయాల నుంచి సస్పెండ్ చేశారు. గోరక్షణ పేర, గొడ్డుమాంసం పేర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రిలో అఖలక్‌ఖాన్‌ను చిత్ర వధ చేసి చంపారు. హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ సరిహద్దులలో ఇదే ఆరో పణతో ఇద్దరు యువకులని హత్య చేశారు. జార్ఖండ్‌లో పశువులను తోలుకుపోతున్న ఇద్దరు మైనారిటీలను ఉరివేసి చంపారు. పశుమాంస భక్షక నిరోధక చట్టం తెచ్చి, వంటింట్లో ఏం వండుకోవాలో ఆదేశించేం దుకు ప్రయత్నించారు. ఇదే నిజమైన అసహనం.

అర్హతలు లేకున్నా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లకు, ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ లకు, అనేక రాష్ట్రాల గవర్నర్ పదవులకు సంఘ పరివార్ కార్యకర్తలను నియమించిన బీజేపీయే, గత ప్రభుత్వం తమ పార్టీ వారి కోసమే ‘తాబేదా రులు, వందిమాగధులకు పదవులు తాకట్టు పెట్టింద’ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వామపక్షాలు మంత్రి పదవులు, గవర్నర్ హోదాలు, సంస్థల అధ్యక్ష పదవులను తీసుకోలేదు. 37 ఏళ్లు ఒకే కుటుం బం దేశాన్ని పరిపాలించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు, బీజేపీకీ, సంఘపరివార్‌కూ సంబంధం లేకున్నా కేవలం నెహ్రూ కుటుంబం నుంచి తమ పార్టీ వైపునకు వచ్చిన మేనకాగాంధీకీ, ఇప్పుడు ఆమె కుమారుడు వరుణ్‌గాంధీకీ మంత్రి పదవులు, పార్లమెంట్ సభ్య త్వాలు ఎందుకు కట్టబెట్టినట్టు? తమ ప్రభుత్వం పేదలకు అంకితమైన ప్రభుత్వమని నరేంద్ర మోదీ రెండేళ్ల ఉత్సవాల సందర్భంగా చెప్పుకు న్నారు.

ఈ రెండేండ్ల కాలంలో గుజరాత్‌కు చెందిన అంబానీ, ఆదాని కుటుంబాలు సహా పది కార్పొరేట్ కంపెనీలకు రూ. 20 లక్షల కోట్లు అదనపు లాభాలు వచ్చిన మాట వాస్తవమా? కాదా? అదే సమయంలో కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించి, సర్వీస్ ట్యాక్స్ లను 12 నుంచి 15 శాతం పెంచడం పేదలకు సేవ చేయడమా? కార్పొరే ట్లకు ఊడిగం చేయడమా?  వామపక్షాల విమర్శలలో ఏది అసమంజసమైనదో వెంకయ్యనా యుడు గారిని చెప్పమని కోరుతున్నాను.

1). విదేశాల నుండి వంద రోజులలో నల్లధనాన్ని (80 లక్షల కోట్ల రూపాయల పై చిలుకు) తిరిగి వెనక్కి తెస్తామని చేసిన వాగ్దానం విఫలమైందని విమర్శిస్తున్నాము.
2). మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలలో మీతో విభేదించే వారందరికి కమ్యూనిస్టు ముద్రకొట్టి, దేశద్రోహం కేసుపెట్టి, విద్యార్థి నాయకుల్ని బెదిరించి ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు విఘాతం కలిగిస్తున్నారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశాం.
3). 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చేసిన వాగ్దానంలో 20 శాతం కూడా సృష్టించలేదని ఆరోపిస్తున్నాం.
4) ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాం.
5). మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల భూముల్ని లాక్కునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ రైతాంగ వ్యతిరేకమైనదని, పారిశ్రామికవేత్తల ప్రయోజ నాలు కాపాడేందుకని ఆరోపిస్తున్నాం.
6). కార్మిక చట్టాల సవరణ పేరుతో ట్రేడ్ యూనియన్‌ల హక్కులు కాలరాసేందుకు ప్రభుత్వం పూనుకుంటు న్నదని బహిర్గతం చేస్తున్నాం.
7). మీ పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహ రాజ్, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే విగ్రహాలను దేశ వ్యాపితంగా ప్రతిష్టించాలని బహిరంగ ప్రకటన చేస్తే, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ దళితుల్ని కుక్కలతో పోలిస్తే.. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా మౌనం దాల్చడం ద్వారా పరోక్షంగా వారి వ్యాఖ్యలను ఆమో దించినట్టేనని చెబుతున్నాం.
8). మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లకుపైగా కార్పొరేట్ల కంపెనీలకు పన్నుల తగ్గింపు, రాయితీలు ఇస్తున్నారని దేశంలో వేల సంఖ్యలో కరువు, అప్పుల కారణంగా ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులకు పైసా విదల్చలేదని, మీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లతో నడుస్తున్న ప్రభుత్వమని ఆరోపిస్తున్నాం.
9). మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు ఉత్తరప్రదేశ్‌లో అసత్యాలు, అబ ద్ధాలు ప్రచారం చేసి రెచ్చగొడుతున్నారని, హిందూత్వ శక్తులపైనున్న టైరిస్టు కేసులను కొట్టి వేయిస్తున్నారని, మైనారిటీలను భయభ్రాంతులను చేస్తున్నారని ఆరోపిస్తున్నాం.
10). ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పి స్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, మాట తప్పారని విమర్శించాము.
11). అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు దేశంలో వాటి ధరలు పెంచి, ప్రపంచ ధరలు మూడో భాగానికి పడిపోయినా, ఆ సౌక ర్యం వినిమయదారులకు ఇవ్వకుండా కొత్త పన్నులు వేసి, ప్రజలను మోసం చేశారని విమర్శించాం. 12). 9,000 కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకు లకు ఎగబెట్టిన విజయ్‌మాల్యాను, క్రికెట్ ఆటను దుర్వినియోగం చేసిన అవినీతిపరుడు లలిత్‌మోదీని అరెస్టు చేయకుండా విదేశాల నుండి వారిని రప్పించే చర్యల్లో కావాలనే విఫలమయ్యారని ఆరోపిస్తున్నాం. 13). విదే శాంగ విధానంలో అమెరికాకు మోకరిల్లడం ద్వారా, టెండర్లు పిలవకుండా నష్టంలో ఉన్న కంపెనీకి నాలుగు అణు విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టును నాలుగు లక్షల కోట్లకు ఇచ్చి యూనిట్ ఖరీదు రూ.50 లకు కొనే వ్యాపారం చేసి, దేశానికి నష్టం చేస్తున్నారని విమర్శిస్తున్నాం.

మీరు వాగ్దానం చేసిన ‘అచ్చేదిన్’ కోటీశ్వరులకు, సంఘ్‌పరివార్‌కు తప్ప సాధారణ ప్రజలకు ‘‘బూరాదిన్’’ (చెడ్డరోజులు) మాత్రమేనని భావిస్తున్నాం. వామపక్షాలు కాంగ్రెస్ వారి ఆర్థిక విధానాలపైనా, అవినీ తిపైనా నిరంతరం ఎండగట్టి, పోరాటం చేస్తున్నాయి. అలాగే బీజేపీనీ విమర్శిస్తున్నాయి. వామపక్షాల విమర్శలతో దేశాభివృద్ధి ఆగిపోతున్నదని చెప్పడం అతిశయోక్తి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతోపాటు రిటైల్ ట్రేడ్‌లో ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా దేశవ్యాపిత బంద్‌కు ఒకేరోజు పిలుపు ఇచ్చిన మాట గుర్తుందా? ఇప్పుడు మీరు కీలక రంగమైన డిఫెన్స్‌లో, రిటైల్ ట్రేడ్‌తో సహా దాదాపు అన్ని రంగాలలో 100 శాతం ఎఫ్‌డీఐ ఎందుకు తెస్తున్నట్లు?

ఢిల్లీలో, బిహార్‌లో మీరు మా విమర్శల వల్ల ఓడిపోలేదు. మీ వాగ్దా నాలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి మిమ్మల్ని ఓడించారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్నిచోట్ల 2014తో పోలిస్తే మీ ఓట్ల శాతం అదే కారణంవల్ల పడిపోయింది. కార్పొరేట్ కంపె నీల తరఫున పనిచేసే ప్రధానిగా మాకు మోదీ కనబడుతున్నారు. ప్రజాభి ప్రాయాన్ని గౌరవించి, మీ ప్రజావ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అను కూల విధానాలను మార్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం.

 

 సురవరం సుధాకరరెడ్డి,
 వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
 మొబైల్ : 94400 66066

మరిన్ని వార్తలు