నాటకం మొదలైంది...!

13 Sep, 2016 01:14 IST|Sakshi
నాటకం మొదలైంది...!

ప్రజల చేతులు కాలాక పవన్ ఆకులు పట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా ప్రజలను మభ్యపరి చేలా పవన్ మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది.
 
 
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సార థ్యంలో కొనసాగిన ప్రత్యేక హోదా అనే సినిమా అయి పోయింది. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ నాటకం మొద లైంది. అసలు విషయం పక్కన పడింది. అయోమయం అల ముకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పవన్ కల్యాణ్ నడుం బిగించారన్న విషయం కాకినాడ సభలో తేటతెల్లమైపోయింది.

పవన్ కల్యాణ్ ఆత్మగౌరవ సభ తెలుగుదేశం పార్టీ మారువేషంలో ఏర్పాటు చేసిన సభగానే స్పష్టమైపోయింది. కేవలం బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని టార్గెట్ చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని బతికించడానికి చేసిన ప్రయత్నంగానే స్పష్ట మైంది. ఏపీకి ప్రత్యేకహోదాని కల్పించే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆడుతున్న దాగుడుమూతల్ని పవన్ తూర్పార పట్టలేకపోయారు. పవన్ నిర్వహించిన ఆత్మ గౌరవ సభ బాబు గౌరవసభగానే మిగిలిపోయింది.
 
తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మంచి నినాదం ఈ సభలో దొరుకుతుందని అందరూ ఆశించారు. కానీ నినాదం పక్కకు పోయి సినీఫక్కీని మించి ఉన్మాదం తీరులో పవన్ ప్రసంగం సాగింది. ఈ రాష్ట్రానికి దశ, దిశలను సూచించే మార్గం ఎక్కడా కనిపించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు రాజీపడి ప్యాకేజీకి ఒప్పేసుకున్న విషయం అందరికీ స్పష్టంగానే అర్థం అయింది.

తను తీసుకున్న నిర్ణయంవల్ల ప్రజల్లో తనకు అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? అన్న విషయమై బాబు సర్వే కూడా చేసేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ ప్రజలు నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తున్నారు. ఈ విషయం పవన్‌కి తెలుసు. అయినప్పటికీ ఈ నెపాన్ని ఒక్క బీజేపీ మీదకే నెట్టేసి బాబును గట్టె క్కించడానికి మారువేషంలో వచ్చిన ‘తమ్ముడు’గానే పవన్ బయట పడ్డారు.
 
ప్రత్యేక హోదాపై బాబు గతంలో చేసిన ప్రకటనను గాని, ఇప్పటి ప్రకటనలను గాని పవన్ ప్రశ్నించలేక పోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన అన్న చిరంజీవిని, తల్లిని, వదినను వదులు కుని ప్రాణాలకు తెగించానన్న పవన్ ఇప్పుడు బాబు నిర్ణయం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న  నష్టాన్ని ఎలుగెత్తి చాటలేకపోయారు. అయితే సినిమా డైలాగులు రాసు కొచ్చి నోటికొచ్చినట్టు ఉన్మాది స్టైల్ల్లో పవన్ పలికేసి వెళ్లిపో యారు.
 
సమావేశానికి అశేష సంఖ్యలో వచ్చిన అభిమాను లకు గాని, టీవీల్లో చూసిన జనాలకుగాని పవన్ ఎందుకు ఈ ఆత్మగౌరవ సభ పెట్టారో అర్థం కాలేదు. ఈ స్పెషల్ స్టేటస్ గండం నుంచి బాబును తప్పించి ‘ఆత్మరక్షణ’ చేసు కునే సమావేశంగానే పవన్ మలిచారన్నది స్పష్టం.
 
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధినేత బాబు ఆదేశాలు లేకుండా స్పెషల్ స్టేటస్ గురించి ఆందోళన చేయగలరా? మరి బాధ్యులైన బాబును విడిచిపెట్టి పవన్ కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేశారు? స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి బాబు బాధ్యతను పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ‘హోదా కోసం ప్రధాని మోదీని ప్రశ్నించడానికి బాబు భయపడుతున్నారా..? మీ మధ్య లొసుగులు ఏమైనా ఉన్నాయా?’ అని పవన్ తిరు పతి సభలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పవన్ తీరును చూసిన తర్వాత, ‘బాధ్యత’ గల ముఖ్యమంత్రిగా ఉన్న బాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని, వీరిద్దరి మధ్యా లొసుగులు ఏమైనా ఉన్నాయా..? అని ప్రజలకు అనుమానం కలుగుతోంది.
 
ప్రజల చేతులు, మూతులు కాలాక పవన్ ఆకులు పట్టుకు వస్తున్నారు. ఆయనకిది కొత్తకాదు. అమరావతి భూముల విషయంలో పవన్ బాధిత రైతులతో కలసి చిన్నపాటి సమావేశంతో హడావుడి చేశారు. అప్పుడు బాబు పవన్‌కు కండువా వేసి తిరుపతి ప్రసాదం ఇచ్చి పంపారు. తర్వాత రాజమండ్రి పుష్కరాల సమయంలో బాబు హారతి షూటింగ్ సందర్భంగా 27 మంది అమా యక ప్రజలు బలైపోయిన సందర్భంలో పవన్ వచ్చి అది ‘అసాంఘిక శక్తుల పనే’ అంటూ నాలుగు డైలాగ్‌లు చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ హోదా స్క్రిప్ట్‌తో వచ్చారు. ఇలా రావడం... నాలుగు డైలాగ్‌లు చెప్పడం.. వెళ్లిపోవడం పవన్‌కు పరిపాటే. ఇదంతా ‘సేమ్ టు సేమ్’ గానే పవన్ కొనసాగిస్తున్నారు.  
 
కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చంద్రబాబు అంగీకరిం చారు. శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసి ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. హోదా లేకుండా ప్యాకేజీని స్వాగతించడమేమిటంటూ పవన్ ఒక్క డైలాగ్ కూడా చెప్ప కపోవడాన్ని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. జనంలో జనసేన మీద పెరిగిన అనుమానాలను కాకినాడ సభ నిజం చేసిందని చెప్పక తప్పదు.

బీజేపీతో టీడీపీ విడి పోతే దాన్ని కొమ్ము కాయడానికే జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పకనే చెప్పేశారు. చివరికి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే ‘నేనే’ అక్కడ కూర్చుని గెలిపిస్తా నని పవన్ ప్రకటించేశారు. ఒక పక్క బాబు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా పవన్ ప్రజలను మభ్యపరిచే మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది.
 


 వి.వి. రమణమూర్తి
 వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
 మొబైల్ : 93485 50909

>
మరిన్ని వార్తలు